Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావస్తోంది. ఆరు నెలల వ్యవధిలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. పంచాయతీ పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం భయపడుతోందని విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. అయితే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని భావించిన రేవంత్ సర్కార్‌కు షాక్ తగిలింది. బిల్లు ఆమోదం పొందకపోగా, ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు, సుప్రీం కోర్టు స్టే ఇచ్చాయి. దీంతో ఇప్పుడు ఎన్నికలకు ఎలా వెళ్లాలో తెలియక అధికార కాంగ్రెస్ సందిగ్ధంలో పడింది. ఒకవైపు బీసీ సంఘాల ఒత్తిడి, ఇంకోవైపు కోర్టు ఆదేశాలతో ఏం చేయాలో తోచని పరిస్థితి. ఈ క్రమంలో గురువారం(అక్టోబర్ 23న) జరిగిన కేబినెట్ సమావేశంలో స్పష్టత వస్తుందని అంతా భావించారు. కానీ, ఎన్నికలపై ఎటూ తేల్చలేదు.
మరోసారి వాయిదా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల సమయం, రిజర్వేషన్ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాన్ని తదుపరి కేబినెట్ సమావేశంలో మళ్లీ చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం.
రిజర్వేషన్లపై హైకోర్టు స్టే..
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు మధ్యలో ప్రధాన ఆటంకం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ఆర్డర్. పంచాయతీ రాజ్, మండల, జిల్లా పరిషత్ స్థాయిలలో 42 శాతం రిజర్వేషన్ అమలుపై సవాళ్ల మధ్య కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్టపరమైన స్థితిని స్పష్టంగా అర్థం చేసుకునే వరకు నూతన షెడ్యూల్ ప్రకటించకూడదన్న నిర్ణయానికి కేబినెట్‌లో ఏకాభిప్రాయం ఏర్పడింది.
నవంబర్ 3న తీర్పు.. 7న కేబినెట్ భేటీ..
హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 3న తీర్పు ప్రకటించనుంది. ఆ తీర్పు వెలువడిన అనంతరం రాష్ట్ర క్యాబినెట్ మళ్లీ నవంబర్ 7న సమావేశం అయ్యే అవకాశం ఉంది. అప్పటిలోపు చట్టపరమైన మార్గదర్శకాలు స్పష్టమైతే ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్ నిష్పత్తులపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ప్రభుత్వం వ్యూహాత్మక ధోరణి..
స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర రాజకీయపరంగా కీలకమైనవిగా భావిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రిజర్వేషన్ అంశంలో చెల్లుబాటు అయ్యే చట్టబద్ధ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా కోర్టు ఆంక్షల నుంచి తప్పించుకోవాలనే ఆలోచనలో ఉంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించవచ్చని భావిస్తోంది. ఇదే సమయంలో రిజర్వేషన్లకు బీసీ సంఘాలు పట్టుబడుతున్నాయి. పార్టీల పరంగా కాకుండా చట్టబద్ధంగా రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
మొత్తానికి నవంబర్ 3న హైకోర్టు ఇచ్చే తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలకు దిశానిర్దేశం చేసే కీలక ఘట్టం కానుంది. కోర్టు స్టే ఎత్తివేస్తే ప్రభుత్వం తక్షణం ఎన్నికల తేదీలను ఖరారు చేస్తుంది. లేకపోతే, రిజర్వేషన్ల పునర్‌వ్యవస్తీకరించి చట్టసవరణ వంటి ప్రక్రియలతో మరికొంత కాలం ఆలస్యమయ్యే అవకాశం ఉంది.