Kakatiya Textile Park : కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడంలో తెలుగు రాష్ట్రాల తర్వాత ఎవరైనా. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా.. కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వకముందే.. ఘనత వహించిన ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటాయి. అందరికీ ఉద్యోగాలు వస్తాయని కంపెనీల తరఫున వకల్తా పుచ్చుకొని మాట్లాడుతుంటాయి. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు పరిపాలిస్తున్నప్పుడు హైదరాబాద్ నగర శివారులో భారీగా భూమి కేటాయించారు. ఓ వ్యాపారవేత్త ఈ భూములను తీసుకున్నారు. ఏకంగా ఆ భూములను విక్రయించడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆ విషయంపై కోర్టు దాకా వెళ్లడంతో భూములు ప్రభుత్వానికి వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కార్పొరేటర్ల లీలలు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఉన్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు అప్పటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తగ్గట్టుగానే రైతుల దగ్గర్నుంచి 1200 ఎకరాల భూములు సేకరించింది. అంతేకాదు ఇది టెక్స్టైల్ పార్క్ ద్వారా ఏకంగా లక్ష ఉద్యోగాలు యువతకు లభిస్తాయని ప్రకటించింది. నాడు పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ ఈ టెక్స్టైల్ పార్క్ గురించి గొప్పగా చెప్పారు. వస్త్ర తయారీ పరిశ్రమలో వరంగల్ గేమ్ చేంజర్ అవుతుందని ప్రకటించారు. అంతేకాదు కెసిఆర్ ఆలోచన నుంచి పుట్టిన ఈ పార్క్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. నాడు ఈ టెక్స్టైల్ పార్కును కెసిఆర్, కేటీఆర్ ప్రారంభించారు. నాడు ఈ వేడుకను అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం ఈ టెక్స్టైల్ పార్క్ ప్రారంభమైంది. కానీ ఇంతవరకు చెప్పుకోదగిన స్థాయిలో ఒక పరిశ్రమ కూడా రాలేదు.
కాకతీయ టెక్స్టైల్ పార్కులో స్థానికంగా 1,25,000 ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. కానీ 8 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఉపాధి కల్పించిన దాఖలాలు లేవు. నాడు 36 కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ కంపెనీలలో అన్ని దాదాపు ముఖం చాటేసాయి. ఒక కంపెనీ మాత్రం సెక్యూరిటీ, కింది స్థాయి కొలువులను 100 వరకు ఇచ్చింది. ఇక్కడ కైటెక్స్ అనే 178 ఎకరాల భూమి కేటాయించారు. యంగ్ వన్ అనే కంపెనీకి 87.34 ఎకరాలు కేటాయించారు. గణేషన్ అనే కంపెనీకి 50 ఎకరాల దాకా ఇచ్చారు. ఈ స్థాయిలో భూములు ఇచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. వాస్తవానికి ఈ టెక్స్టైల్ పార్క్ కోసం సేకరించిన భూములు అత్యంత విలువైనవి. అత్యంత సారవంతమైనవి. ఈ భూముల్లో రైతులు పత్తి, మిరప వంటి పంటలు సాగు చేసేవారు. ఇప్పుడు భూములు కోల్పోయి.. ఉద్యోగుల దాకా సమీప రైతులు పడుతున్న బాధలు అన్ని ఇన్ని కాదు. కొంతమంది రైతులు ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. స్థానికంగా కూలీలుగా మారిపోయారు.
కార్పొరేట్ కంపెనీలు భూములు కేటాయించాలని చెప్పగానే ప్రభుత్వాలు వెంటనే తల ఊపుతాయి. వాస్తవానికి క్షేత్ర స్థాయి పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా భూ సేకరణకు నడుంబిగిస్తాయి. కార్పొరేట్ కంపెనీల కోసం అధికార యంత్రంగాన్ని భూ సేకరణ కోసం వాడుకుంటాయి. భూముల సేకరణ పూర్తయిన తర్వాత అప్పటిదాకా డబ్బా కొట్టిన ప్రజా ప్రతినిధులు కళ్ళకు కనిపించరు. వారు చెప్పిన కొలువులు స్థానికులకు రావు. కంపెనీలు మాత్రం భూములను స్వాధీనం చేసుకుంటాయి. ఆ భూములను తనఖా పెట్టి బ్యాంకులలో రుణాలు తీసుకుంటాయి. కాకతీయ టెక్స్టైల్ పార్క్ గురించి గొప్పగా చెప్పుకున్న భారత రాష్ట్ర సమితి ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు. కైటెక్స్ కంపెనీ చేస్తున్న అరకొర ఉత్పత్తులను తన ఘనతగా చెప్పుకుంటున్నది. మరోవైపు ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ ఈ పార్కుపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేటాయించిన భూములలో కంపెనీలు కార్యకలాపాలు సాగించకుంటే.. అవి తమకు తిరిగి ఇచ్చేయాలని రైతులు అంటున్నారు.