ICC Test Rankings : టెస్ట్ క్రికెట్ కు సరికొత్త హంగులు అద్దడానికి ఐసీసీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టెస్ట్ క్రికెట్ లో వినూత్న మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ టోర్నీ నిర్వహిస్తోంది. 2025-27 సీజన్ మొదలెట్టేసింది. ఈ సీజన్లో అన్ని జట్లు టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాయి. ఆస్ట్రేలియా- వెస్టిండీస్, దక్షిణాఫ్రికా – జింబాబ్వే, భారత్ -ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ నడుస్తోంది. ఇవి కొనసాగుతుండగానే ఐసిసి తాజాగా ర్యాంకులను ప్రకటించడం గమనార్హం.
ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ ఆటగాడు బ్రూక్ బ్యాటర్ల విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ జట్టుకు చెందిన మరో ఆటగాడు రూట్ ఒక స్థానాన్ని కోల్పోయి, రెండవ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. భారత ఆటగాడు జైస్వాల్ నాలుగో స్థానంలో నిలిచాడు. జైస్వాల్ ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. ఇటీవలి రెండో టెస్టు రెండవ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు.. ప్రస్తుత సిరీస్లో అతడు భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. దీంతో అతడు నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమ్ ఇండియా సారథి గిల్ గతంలో 21 స్థానంలో ఉండేవాడు. ఇప్పుడు ఏకంగా 15 స్థానాలను మెరుగుపరుచుకొని ఆరో స్థానంలోకి వచ్చేసాడు. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒక స్థానాన్ని కోల్పోయి 8వ స్థానానికి చేరుకున్నాడు.. రిషబ్ పంత్ ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్లో తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లలో వరుసగా సెంచరీలు చేశాడు. అయితే రెండవ టెస్టులో మాత్రం సెంచరీలు చేయలేకపోయాడు. ఉన్నంత సేపు మాత్రం దుమ్ము రేపే రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు.
ఇక టెస్టులలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైనప్పటికీ.. ఆస్ట్రేలియా ర్యాంక్ మారకపోవడం విశేషం. అంతకుముందు భారత్ పై మూడు, శ్రీలంకపై రెండు టెస్టులు గెలిచి.. ఆస్ట్రేలియా మొదటి స్థానంలోకి అడుగు పెట్టింది. ఇక అప్పట్నుంచి తన ర్యాంకును స్థిరంగానే ఉంచుకుంటున్నది. ఆస్ట్రేలియా తర్వాత దక్షిణాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉంది.. టీమిండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక వన్డేలలో టీమిండియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచి టీమిండియా తన నెంబర్ వన్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. టి20 టీమిండియా మొదటి స్థానంలో ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా టీమిండియా ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో సఫారీ లను ఓడించి సిరీస్ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. అతడు గనుక పరుగుల వరదను ఇదే స్థాయిలో కొనసాగిస్తే ఖచ్చితంగా తన ర్యాంకును పెరుగుపరుచుకుంటాడు. ప్రస్తుతం ఆరవ స్థానంలో ఉన్న అతడు.. టాప్ -5 లోకి వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సిరీస్ లో ఇప్పటికే అతడు ఒక డబుల్ సెంచరీ, రెండు శతకాలు సాధించాడు. ముఖ్యంగా రెండవ టెస్టులో అతని బ్యాటింగ్ అద్భుతం. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ.. రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై తన సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు.