Jubilee Hills by-election survey : బిసి రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఆగిపోయాయి. కానీ తెలంగాణ రాజకీయాలు మాత్రం హాట్ హాట్ గా సాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలు. ఈ నియోజకవర్గంలో మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అనారోగ్యం వల్ల కన్నుమూశారు. దీంతో ఈ నియోజకవర్గంలో అనివార్యంగా ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉపఎన్నిక అటు భారత రాష్ట్ర సమితికి.. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా నిలిచింది. దీంతో రెండు పార్టీలు హోరా హోరీగా పోరాడుతున్నాయి. బిజెపి తన అభ్యర్థిని పోటీలో నిలిపినప్పటికీ.. ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, గులాబీ పార్టీ మధ్యలోనే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

గులాబీ పార్టీ తన అభ్యర్థిగా మాగంటి సునీతను రంగంలో నిలిపింది. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను పోటీలో ఉంచింది. ఈ రెండు పార్టీలు గెలుపును అత్యంత సవాల్ గా తీసుకున్న నేపథ్యంలో పోటీ హోరా హోరిగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలను ఏప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన గెలుపుపై బలమైన నమ్మకంతో ఉన్నారు. నవీన్ యాదవ్ కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు పలికారు. దీంతో గెలుపు తనదేనని నవీన్ యాదవ్ చెబుతున్నారు. గెలుపు, ఓటముల విషయం పక్కన పెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడి ఓటర్లు ఏమనుకుంటున్నారు.. ఎవరు గెలిచే అవకాశం ఉంది.. ఈ అంశాలపై ఆర్ఆర్ పొలిటికల్ సర్వేస్ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎవరు ఉండాలనే అంశంపై ప్రజలను అభిప్రాయం కోరితే 33.35% ఉంది సునీతకు జై కొట్టారు. నవీన్ యాదవ్ కు ఓటు వేస్తామని 49.55 శాతమంది చెప్పారు.. 12.5 శాతం మంది తెలియదు, చెప్పలేము అనే సమాధానం వెల్లడించారు..
పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి అనే అంశాలను ప్రస్తావిస్తే.. రేవంత్ రెడ్డికి అనుకూలంగా 19.79 శాతం మంది, కెసిఆర్ కు అనుకూలంగా 67.70 శాతం మంది సమాధానం చెప్పారు. తెలియదు, చెప్పలేమని 12.5 శాత మంది సమాధానం చెప్పారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసే సత్తా ఎవరికి ఉందనే ప్రశ్నకు.. కాంగ్రెస్ పార్టీకి 18.75 శాతం మంది అనుకూలంగా సమాధానం చెప్పారు.. గులాబీ పార్టీకి అనుకూలంగా 32.44 శాతం మంది, బిజెపికి 3.12 శాతం మంది అనుకూలంగా సమాధానం చెప్పారు. తెలియదు, చెప్పలేమనే సమాధానాన్ని 12.5 మంది చెప్పారు..
తెలంగాణ రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే ప్రశ్నకు రేవంత్ రెడ్డికి అనుకూలంగా 20.3 శాతం మంది, కెసిఆర్ కు 66.66 శాతం మంది, బండి సంజయ్ కి 7.29 శాతం మంది, కిషన్ రెడ్డికి అనుకూలంగా 1.29 శాఖ మంత్రి అనుకూలంగా సమాధానం చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీల వారీగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 50.65 శాతం, గులాబీ పార్టీకి 32.46%, బీజేపీ కి 11.99 శాతం, హెచ్ వై సీ కి 1.03 శాతం, ఇతరులు 1.8%, నోటాకు 2.8 శాతం మంది అనుకూలంగా సమాధానం చెప్పారు..
మొత్తంగా ఈ సర్వేలో కేసీఆర్ పరిపాలన కాలంలో సంక్షేమం, అభివృద్ధి పై ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో మాగంటి సునీత పై సానుభూతి ఉన్నప్పటికీ.. ఎందుకనో ప్రజలు ఓటు వేయడానికి నిరాకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కాలంలో ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ.. నవీన్ యాదవ్ గతంలో పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయిన నేపథ్యంలో సానుభూతి, సామాజిక సేవా కార్యక్రమాల వల్ల ఆయనను ప్రజలు ఆమోదిస్తున్నారు. ఆయన ఈ నియోజకవర్గంలో కులాలతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమయ్యారు. అనేక కార్యక్రమాలు చేపట్టారు.. వాస్తవానికి నవీన్ యాదవ్ కాకుండా మరొకరు గనుక పోటీలో ఉండి ఉంటే కచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోయేదని.. కేవలం ఆయన వ్యక్తిగత చరిష్మా వల్ల మాత్రమే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. స్థూలంగా నవీన్ యాదవ్ ఈ నియోజకవర్గంలో 30 నుంచి 36,000 వరకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్నట్టు ఆర్ఆర్ పొలిటికల్ సర్వేస్ సంస్థ సర్వేలో తేలింది.