Nagababu uttaraandhra contest : వచ్చే ఎన్నికల్లో నాగబాబు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారా? అందుకే సరైన నియోజకవర్గాన్ని ఎంచుకునే పనిలో ఉన్నారా? తరచూ ఈ ప్రాంతంలో పర్యటనలు అందుకేనా? అయితే ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో ఆయన పర్యటించారు. శ్రీకాకుళం తో పాటు ఎచ్చెర్ల లో పర్యటన చేశారు. దీంతో ఈ కొత్త చర్చ ప్రారంభం అయింది. ఈ రెండు నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటించినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు లేరు. ప్రస్తుతం శ్రీకాకుళం ఎమ్మెల్యేగా టిడిపికి చెందిన గొండు శంకర్, ఎచ్చెర్ల నుంచి బిజెపి ఎమ్మెల్యే ఈశ్వరరావు ఉన్నారు. ఆయన వెంట వారిద్దరూ కనిపించకపోవడంతో కొత్త చర్చకు దారితీసింది. అంటే వ్యక్తిగత పర్యటన అన్న మాదిరిగా నాగబాబు ఆ రెండు ప్రాంతాలను సందర్శించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఏదో ఒక నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తారన్న టాక్ ప్రారంభం అయింది.
* ఎంపీగా పోటీ చేసేందుకు..
వాస్తవానికి నాగబాబు 2019లో జనసేన తరఫున నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. రెండున్నర లక్షల ఓట్లకు పైగా సాధించారు. 2024 ఎన్నికల్లో సైతం అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఎలమంచిలి లో తాత్కాలిక నివాసం సైతం ఏర్పాటు చేశారు. అయితే పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించారు. ఆ పార్టీ తరపున సీఎం రమేష్ పోటీ చేసి గెలిచారు. మరోవైపు నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం నడిచింది. సమీకరణలో భాగంగా ఆ అవకాశం చిక్కలేదు. దీంతో మంత్రిగా ఛాన్స్ ఇస్తామని చెప్పి మొన్ననే ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు.
* నెల్లిమర్ల నియోజకవర్గం అయితే..
అయితే ఉత్తరాంధ్రలో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్నది నాగబాబు ప్లాన్ గా తెలుస్తోంది. ప్రధానంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల, శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లపై ఫుల్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం అధికం. అందుకే ఇప్పటినుంచే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే నెల్లిమర్లలో ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఆమెపై టిడిపి క్యాడర్ ఆగ్రహంగా ఉంది. అందుకే నాగబాబు అక్కడ పోటీ చేస్తారని తెలుస్తోంది. కానీ తాజాగా శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులు పర్యటించారు నాగబాబు. పార్టీ బలోపేతం లో భాగంగానే ఆయన పర్యటన సాగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ నాగబాబు దూరదృష్టితోనే ఈ పర్యటన సాగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.