Jawan Anil : జమ్ముకాశ్మీర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ అనిల్ భౌతిక కాయం శనివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన పార్థివ దేహాన్ని చూసి అందరు శోకసముద్రంలో మునిగిపోయారు. అనిల్ స్వగ్రామం బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామం. హైదరాబాద్ కు చెందిన ఆర్మీ అధికారులు శుక్రవారం గ్రామాన్ని సందర్శించి అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. వేదిక విశాలంగా ఉండేలా చూసుకున్నారు. జనసందోహం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
శుక్రవారం సాయంత్రం హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు అనిల్ పార్థివ దేహం చేరుకుంది. ప్రత్యేక విమానంలో అనిల్ పార్థివ దేహానికి తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ కమాండింగ్ ఆఫీసర్ జనరల్ రాకేశ్ మనో నివాళులు అర్పించారు. హెలికాప్టర్ కూలి ఓ నదిలో పడిపోవడంతో అనిల్ వీరమరణం పొందాడు. 45 రోజులు సెలవుల అనంతరం పదిరోజుల క్రితమే అనిల్ విధుల్లో చేరినట్లు తెలిపారు. ఇంతలోనే ప్రమాదంలో చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
అనిల్ పార్థివ దేహానికి భార్య సెల్యూట్ చేసి మీద పడి రోదించడం అందరిని కలచివేసింది. దేశం కోసం పనిచేస్తూ చనిపోవడం ఎంత మందికి సాధ్యమని అందరు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనిల్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనిల్ పార్థివ దేహం గంగాధర చౌరస్తా చేరుకునే సరికే జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇక్కడి నుంచే అంతిమయాత్ర ప్రారంభం అయింది. ప్రజలు పెద్దఎత్తున హాజరయి నడిచారు. అనిల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దేశ సేవలో తన ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రజలు అతడి వెంట నడిచారు. అంత్యక్రియలో జనసందోహం కనిపించింది.
