Telangana Jagruti: భారత రాష్ట్ర సమితి బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేశారు. ఇటీవల ఆమె లండన్ ప్రాంతంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిని మర్చిపోకముందే మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజకీయంగా తాను ఒంటరిని కాదని.. తాను బలమైన శక్తినని.. నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల తాను నిర్వహిస్తున్న జాగృతి ఆధ్వర్యంలో లీడర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కల్వకుంట్ల కవిత. ఆ తర్వాత జాగృతి ఆధ్వర్యంలోనే తెలంగాణ ఆస్తిత్వాన్ని బలపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. కవులను సన్మానించారు. కళాకారులను గౌరవించారు. తెలంగాణ స్ఫూర్తి ప్రదాతల జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఒకరకంగా భారత రాష్ట్ర సమితి చేయలేని పని కల్వకుంట్ల కవిత చేసి చూపిస్తున్నారు. కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉన్నప్పటికీ.. ఆమె అనుకూల గ్రూపులు లేవని అపవాదు ఇప్పటివరకు ఉండేది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కవితక్క అప్డేట్స్ పేరుతో ట్విట్టర్లో ఒక ఎకౌంటు తెగ సర్కులేట్ అవుతుంది. అందులో హరీష్ రావు గురించి, సంతోష్ రావు గురించి తెలంగాణ ప్రజలకు తెలియని విషయాలను చెబుతున్నారు. చెప్పడం మాత్రమే కాదు బలమైన ఆధారాలను కూడా చూపిస్తున్నారు.
జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన కల్వకుంట్ల కవితలో ఉన్నప్పటికీ ఇంతవరకు దానిని బయట పెట్టలేదు. అయితే తాజాగా అనుకున్న సమాచారం ప్రకారం కల్వకుంట్ల కవిత ఏకంగా జాగృతిలో సామాజిక తెలంగాణ ఉండేవిధంగా చూసుకుంటున్నారు. జాగృతి వ్యవస్థాపకురాలిగా కల్వకుంట్ల కవిత కొనసాగుతుండగా.. దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన లకావత్ రూప్ సింగ్ ను నియమించారు.. ఉపాధ్యక్షులుగా రియాజుద్దీన్, మంచాల వరలక్ష్మి పుస్కూరి శ్రీకాంత్ రావును నియమించారు. అంతేకాక జాగృతి ఆధ్వర్యంలో వివిధ అనుబంధ సంఘాలకు.. జిల్లాలకు బాధ్యులను నియమించారు కల్వకుంట్ల కవిత. వీరి నియామకం వెంటనే అమలులోకి వస్తుందని.. జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలను బలోపేతం చేయాలని కవిత వారికి ఆదేశాలు జారీ చేశారు.
కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితి నుంచి బహిష్కృత అస్త్రాన్ని ఎదుర్కొక ముందే కొన్ని జిల్లాలకు కమిటీలను నియమించారు. జాగృతి అనుబంధ సంఘాలకు బాధ్యులను కూడా నియమించారు. మలి విడతలో ఇంకా కొంతమందిని నియమించి జాగృతిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే జాగృతి బలపడితే ఎవరికి నష్టం? ఎవరికి లాభం? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.