Telangana groundwater level: తెలంగాణ రాష్ట్రంలో భూగర్భజల స్థాయిలు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది మార్చి చివరి నాటికి సగటు నీటి మట్టం 1.69 మీటర్లు ఎక్కువగా నమోదైనట్లు భూగర్భజల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాదిలో భూమి మట్టానికి (బిజిఎల్) దిగువన 8.22 మీటర్లకు చేరిన నీరు.. ఈ ఏడాదిలో సగటుగా 9.91 మీటర్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే 1.69 మీటర్లు పెరిగినట్లు తెలుస్తోంది. గడిచిన రుతుపవనాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడమే భూగర్భ జలాల పెరుగుదలకు కారణం అని అధికారులు తెలుపుతున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
భూగర్భజల శాఖ అధికారులు తెలుపుతున్న ప్రకారం.. రాష్ట్రంలోని 1,771 మానిటరింగ్ స్టేషన్ల నుంచి భూగర్భజలాలకు సంబంధించిన డేటాను సేకరించారు. గడిచిన వర్షాకాలంలో సాధారణం కంటే 37 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 876 మిల్లిమీటర్లు. కానీ ఈసారి 1,197 మిల్లీ మీటర్ల వర్షపాతం అధికంగా నమోదైంది. దీంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయంతో పాటు తాగునీటి అవసరాలకు అందుబాటులో ఉన్నాయి.
జిల్లాల వారీగా చూస్తే, ఖమ్మం జిల్లాలో భూగర్భజల మట్టం Below Ground Level(బిజిఎల్)కు దిగువన కేవలం 4.52 మీటర్ల మాత్రమే ఉంది. ఇది రాష్ట్రంలో అత్యధిక స్థాయి. మరోవైపు, వికారాబాద్ జిల్లాలో 13.72 మీటర్ల బిజిఎల్ వద్ద నీటి మట్టం తక్కువగా ఉంది. భూగర్భజల శాఖ అధికారులు, ఈ పెరుగుదల రాష్ట్రంలో నీటి భద్రతకు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో స్థిరమైన వర్షపాతం, నీటి నిర్వహణ చర్యలు అవసరమని సూచించారు. అత్యధిక వర్షపాతం నమోదు కావడానికి చెట్లను పెంచడం వంటి చర్యలు చేపట్టాలన్నారు.
ఇక మిగతా ప్రాంతాల్లోకి వెళితే.. 12 జిల్లాల్లో 5 మీటర్లకు దిగువన నీటి మట్టం ఉంది. 21 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్ల మధ్య నమోదైంది. వికారాబాద్ (9.82 మీ.), సిద్దిపేట (8.19 మీ.), సంగారెడ్డి (9.30 మీ.) వంటి ప్రాంతాల్లో తక్కువ నీటి మట్టం నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తోంది. వేసవి ప్రభావంతో ఏప్రిల్, మే నెలల్లో లో నీటిమట్టం మరింత పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యపేట (24.20 మీ.), నల్గొండ ప్రాంతాల్లో. 37% అదనపు వర్షపాతం ప్రయోజనం చూపినా కూడా ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులతో నీటి మట్టం పడిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.