HomeతెలంగాణRevanth Reddy statement on Chandrababu: నితీష్, షిండే పరిస్థితే చంద్రబాబుకు.. రేవంత్ మాటల్లో నిజమెంత..

Revanth Reddy statement on Chandrababu: నితీష్, షిండే పరిస్థితే చంద్రబాబుకు.. రేవంత్ మాటల్లో నిజమెంత..

Revanth Reddy statement on Chandrababu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణాన్ని భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి మొదలుపెట్టి ఉండవచ్చు. కానీ అనతి కాలంలోనే ఆయన ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటికే ఆయనకు జెడ్పిటిసిగా చేసిన అనుభవం ఉంది. ఈసారి టిడిపిలో బలమైన స్థానాన్ని సంపాదించారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి.. కొడంగల్ కింగ్ అయిపోయారు.

ఎప్పుడైతే సొంత నియోజకవర్గంలో పట్టు సాధించారో.. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తన ప్లాన్ మొత్తాన్ని హైదరాబాద్ కు మార్చారు. కొడితే ఈయనకు కుంభస్థలం కొట్టాలి అన్నట్టుగా.. రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించారు. నాడు వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా మాట్లాడగలిగే గొంతుగా ఆవిర్భవించారు. ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి వల్ల మాత్రమే అవుతుందని అందరూ అనుకునేలా చేశారు. కెసిఆర్ ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నప్పటికీ.. రేవంత్ రెడ్డి బయటికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత రేవంత్ కాంగ్రెస్లో కీలక వ్యక్తిగా మారిపోయారు. పిసిసి అధ్యక్షుడిగా.. ముఖ్యమంత్రిగా.. తన రాజకీయ ప్రస్తానాన్ని మరో విధంగా మార్చుకున్నారు.. వాస్తవానికి రేవంత్ ఈ స్థాయి దాకా ఎదుగుతారని ఎవరూ ఊహించి ఉండరు.

తన రాజకీయ ప్రస్తానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మొదలు పెట్టినప్పటికీ.. తన గురువుగా చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి పేర్కొంటారు. ఏనాడు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు విషయంలో మాట తూలలేదు. చివరికి పార్టీ నుంచి బయటికి వస్తున్న సందర్భంలోనూ.. నేను వెళ్తున్నాను సార్ అని మాత్రమే చెప్పారు. సాధారణంగా రాజకీయ నాయకులు అప్పటిదాకా ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్తున్నప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేసి వెళ్తారు. అన్ని పదవులు అనుభవించినప్పటికీ.. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి అలా చేయలేదు. తన రాజకీయ ప్రస్తానానికి బలమైన కారణమైన చంద్రబాబును గొప్పగానే అభివర్ణించారు.

తొలిసారిగా చంద్రబాబు మీద రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి ఢిల్లీలో విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ఉండేవారని.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలని.. గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉండేవారని.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. బిజెపితో ప్రయాణం సాగించిన ఏ పార్టీకైనా ఇదే గతి పడుతుందని రేవంత్ రెడ్డి అన్నార. నితీష్, షిండే మాదిరిగానే చంద్రబాబు కూడా ఒత్తిడి ఎదురుకోవాల్సి వస్తుందని.. బిజెపి వేసే ఉచ్చులో చిక్కుకోవాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు టిడిపి నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నప్పటికీ.. చంద్రబాబు భవిష్యత్తు రాజకీయాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారు. దీంతో రేవంత్ మాట్లాడిన మాటలు భవిష్యత్తు కాలంలో నిజమవుతాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ చంద్రబాబు మీద రేవంత్ ఇలా మాట్లాడుతారని కలలో కూడా ఊహించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version