Graduates MLC Elections : ఇదీ పట్టభద్రులు ఓట్లు అమ్ముకున్న తీరు.. వైరల్ వీడియో

అయితే మంత్రి క్యాంప్ ఆఫీసులో పట్టభద్రులు భారీగా గుమి కూడటంతో.. దీన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫలితంగా ఆ వీడియో వైరల్ గా మారింది..

Written By: Anabothula Bhaskar, Updated On : May 27, 2024 10:18 pm

Telangana Graduates MLC Elections

Follow us on

Graduates MLC Elections : అది ఖమ్మం నగరంలోని సాయి గణేష్ నగర్.. ఆ ప్రాంతం పాలేరు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అక్కడ రాష్ట్ర రెవెన్యూ శాఖ, ఐఅండ్ పీఆర్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఉంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ నియోజకవర్గాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సోమవారం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికను పురస్కరించుకొని గత కొద్దిరోజులుగా శ్రీనివాస రెడ్డి క్యాంప్ ఆఫీస్ సందడిగా కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తరఫున శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు ప్రచారం కూడా చేశారు. సోమవారం పోలింగ్ ను పురస్కరించుకొని.. పట్టభద్రుల ఓటర్లకు పోలింగ్ స్లిప్పులను కూడా పంచారు.. అసలే కాంగ్రెస్ పార్టీ.. ఆపై అధికారంలో ఉంది.. ఇంకేముంది ఓటుకు 500 రూపాయల చొప్పున పంచుతున్నారని ప్రచారం జరిగింది. కొన్నిచోట్ల డబ్బులు పంచారని వార్తలు కూడా వచ్చాయి. దీంతో కొంతమంది ఓటర్లు తమకు డబ్బులు ఇవ్వాలంటూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు.

సోమవారం ఉదయమే మంత్రి క్యాంప్ ఆఫీసులో బారులు తీరి కనిపించారు. డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ అక్కడ ఉన్న సిబ్బందిని నిలదీసినంత పని చేశారు.. ” డబ్బులు ఇస్తున్నారని ప్రచారం జరిగింది. ఓటుకు 500 ఇస్తున్నారని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. నేను, నా స్నేహితులం కలిసి ఈ ప్రాంతానికి వచ్చాం. కానీ మాకు డబ్బులు ఇవ్వలేదంటూ” పేరు రాయడానికి ఇష్టపడని ఓ ఓటరు పేర్కొన్నాడు.. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వాస్తవానికి సాధారణ ఓటర్ల కంటే, పట్టభద్ర ఓటర్లను సమాజం భిన్నంగా చూస్తుంది. విద్యావంతులు, విచక్షణ కలిగిన వారు, కచ్చితంగా సమర్థవంతమైన అభ్యర్థికి ఓటు వేస్తారు, డబ్బులు ఎట్టి పరిస్థితిలో తీసుకోరు.. అనే అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేశారు పట్టభద్ర ఓటర్లు. కేవలం 500 కోసం బారులు తీరి కనిపించారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని, 500 కోసం ఓటర్లు ఇలా వచ్చారంటే.. దానిని ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. అయితే మంత్రి క్యాంప్ ఆఫీసులో పట్టభద్రులు భారీగా గుమి కూడటంతో.. దీన్ని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫలితంగా ఆ వీడియో వైరల్ గా మారింది..