Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ మరోసారి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారా? ఆమె త్వరలో తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? అందులో భాగంగానే తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. 2019 సెప్టెంబర్ నెలలో తెలంగాణ గవర్నర్ గా తమిళ సై సౌందర రాజన్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె తెలంగాణ గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసి.. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
వైద్య విద్యను అభ్యసించిన తమిళ సై సౌందర రాజన్.. రాజకీయ కుటుంబ నేపథ్యానికి చెందినవారు. ఆమె తండ్రి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. అయినప్పటికీ ఆమె ఏబీవీపీలో చేరారు. వైద్య విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేశారు. అనంతరం బిజెపిలో చేరారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అయినప్పటికీ విజయం సాధించలేకపోయారు. బిజెపి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె పార్టీకి చేసిన సేవలను గుర్తించి తమిళ సై ని తెలంగాణ గవర్నర్ గా నియమించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా.. ఆమె తెలంగాణ గవర్నర్ గా కొనసాగుతున్నారు.
గత ప్రభుత్వంతో తమిళసై సౌందర రాజన్ కు పలు విషయాల్లో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు నేరుగానే గవర్నర్ తీరును విమర్శించడం మొదలుపెట్టారు. గవర్నర్ కూడా తన లైన్ పరిధిలోనే గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ముఖ్యంగా తన మాతృమూర్తి చనిపోయినప్పుడు ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించలేదని, పలు ప్రాంతాలను సందర్శించినప్పుడు కనీసం హెలికాప్టర్ కూడా సమకూర్చలేదని గవర్నర్ ఆరోపించారు. అయినప్పటికీ ఆమె రైలు మార్గంలో ప్రయాణించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అటవీ గ్రామాల్లో పర్యటించారు. గొత్తి కోయలతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. మరోవైపు కీలక బిల్లులను తొక్కి పెట్టారని గత ప్రభుత్వం ఆరోపించింది. ఎటువంటి లొసుగులు లేకపోయినప్పటికీ వాటిని తిప్పి పంపారని విమర్శించింది.. ఈ పరిణామాల నేపథ్యంలో గత ప్రభుత్వం ఇటీవల ఎన్నికల్లో ప్రజాదరణను చూరగొనలేకపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి, గవర్నర్ మధ్య ప్రస్తుతం సఖ్యత వాతావరణం నడుస్తోంది. ఇది ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. కానీ ఆకస్మాత్తుగా తమిళ సై సౌందర రాజన్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. నేడో, రేపో రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అయితే బిజెపి అధిష్టానం ఆమె రాజీనామా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Telangana governor tamilisai resigns may contest lok sabha elections as bjp candidate
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com