New Ration Cards :తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసి కొన్ని సంవత్సరాలు అయింది. గతంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదు. దీనితో కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా రేషన్ కార్డులు వస్తాయని కార్డు లేని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్తగా పెళ్లైన వారు, కుటుంబాలు విడిపోయిన వారు చాలా కాలంగా రేషన్ కార్డుల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డులు దాదాపు అన్ని ప్రభుత్వ పథకాలకు అనుసంధానించబడటంతో, దీనికి ప్రాముఖ్యత పెరిగింది. ఈ సందర్భంలో నిన్న పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 26 నుండి పౌర సరఫరాల శాఖ-ఆహార భద్రత (రేషన్) కార్డులు జారీ చేయబడతాయి. దీనితో, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసిందనే చెప్పాలి. క్యాబినెట్ సబ్-కమిటీ సిఫార్సుల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను క్షేత్ర ధృవీకరణ కోసం జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు పంపుతారు. మండల స్థాయిలో, యూఎల్బీలోని ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యత వహిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శించి, చదివి చర్చించి, ఆపై ఆమోదిస్తారు. ఆహార భద్రతా కార్డులలో సభ్యుల చేర్పులు, మార్పులు చేయబడతాయి. ఈ నెల 26 నుండి అర్హత కలిగిన కుటుంబాలకు పౌర సరఫరాల శాఖ కొత్త ఆహార భద్రతా కార్డులను జారీ చేస్తుంది.
హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల అమలుపై అధికారులతో చర్చించారు. ఇందులో కొత్త రేషన్ కార్డులపై కీలక విషయం వెల్లడించారు. ముఖ్యమైన తేదీలను వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల కోసం జనవరి 16 నుండి 20 వరకు తెలంగాణ అంతటా ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. 21 నుండి 24 వరకు గ్రామ, వార్డు సమావేశాల్లో లబ్ధిదారుల ముసాయిదా జాబితాను ఉంచి, ప్రజల అభిప్రాయం తీసుకుంటామన్నారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. రేషన్ కార్డు దరఖాస్తులకు గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని ఆయన అన్నారు.