Rythu Bharosa : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా రుణమాఫీ పూర్తిస్థాయిలో జరుగలేదు. ఇక రైతు భరోసా ఇప్పటి వరకు చెల్లించలేదు. ఊరటనిచ్చే అంశం సన్న వడ్లకు బోనస్ మాత్రమే. క్విటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. దీనిని గుర్తించిన రేవంత్ సర్కార్.. సంక్రాంతి నుంచి రైతు బంధులు అమలు చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలు విడుదల చేయలేదు. దీంతో సంక్రాంతికి కూడా రైతు భరోసా అందే అవకాశం కనిపించడం లేదు. రైతు భరోసా పథకానికి మరో సమస్య ఆటంకంగా మారింది.
సాగు భూముల గుర్తింపు సర్వే..
సాగు రైతుకే భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సంక్రాంతి నుంచి విడతల వారీగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తోంది. అయితే సాగు భూములను గుర్తించడం ఇప్పుడు ప్రభుత్వానికి సమస్యగా మారింది. రైతులు గబగబా పొలాల వద్దకు వెళ్లి నిల్చుంటున్నారు. తోడుగా రైతులను తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత ట్యాబ్‌లు ఆన్‌చేసి ఆకాశంవైపు చూస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారో తెలియక రైతులు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు ట్యాబ్‌లకు సిగ్నల్ రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కచ్చితమైన లెక్కల కోసం..
తెలంగాణ ప్రభుత్వం రైతులకు భరోసా సాయం అందించేందుకు పొలాలకు సంబంధించిన కచ్చితమైన లెక్కలు వేస్తోంది. ఇందుకోసం శాటిలైట్ టెక్నాలజీని వాడుతోంది. శాటిలైట్ సర్వే చేస్తోంది. ఏ పంటలో సాగు ఉందో శాటిలైట్లు చూపిస్తాయి. ఆ పొలం ఎంత ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది. ఇలాంటి వివరాలూ శాటిలైట్ డేటా యాప్‌లో కనిపిస్తాయి. అయితే ఈ వివరాలు చూపించాలంటే అధికారి కచ్చితంగా పొలం మధ్యలో ఉండాలి. అందుకే అధికారులు పొలాల బాట పడుతున్నారు. ఇప్పటికే ఏఈవోలు మాన్యువల్ సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం మరోవైపు శాటిలైట్ సర్వే చేస్తోంది. తద్వారా అక్రమాలకు చెక్ పడుతుందని భావిస్తోంది. పంటలు వేసిన రైతులకే రైతు భరోసా ఇవ్వాలని భావిస్తోంది.
సరిపోని సర్వే వివరాలు..
శాటిలైనట్ సర్వేను రాష్ట్ర సర్కార్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చేస్తోంది. ఇక ఏఈవోలు మాన్యువల్ సర్వే చేస్తున్నారు. అయితే శాటిలైట్ సర్వేకు, మాన్యువల్ సర్వేకు వివరాలు సరిపోవడం లేదు. పది విషయాల్లో తేడాలు వస్తున్నాయి. దీంతో శాటిటైల్ సర్వే వివరాలతో మళ్లీ ఇప్పుడు ఏఈవోలను రైతుల ఇంటికి పంపిస్తోంది. వారు తమ దగ్గర ఉన్న వివరాలతో సర్వేకు వెళ్తున్నారు. తప్పులు సరిదిద్దే పనిలో పడ్డారు. ఈ సర్వే చేయడానికి ప్రభుత్వం ఓ యాప్ కూడా ఇచ్చింది. అది పని చేయాలంటే అధికారులు పొలం మధ్యలో నిలబడాల్సి ఉంటుంది. ఇది పూర్తి కావడానికి నెలకుపైగా పట్టే అవకాశం ఉంది. దీంతో రైతు భరోసా సంక్రాంతికి కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.