Indira Dairy Program: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణం చేసేందుకు మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత గ్యాస్ సబ్సిడీ పథకాలను కూడా ప్రవేశపెట్టారు. ఇటీవల మహిళా సంఘాలకు రుణాలు కూడా ఇచ్చేందుకు నిధులను రిలీజ్ చేశారు. ఇక తాజాగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కొత్త పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం గ్రామాల్లోని మహిళలకు ఉపయోగపడే అవకాశం ఉంది. మరి ఈ పథకం వివరాలు కి వెళ్తే..
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ‘ ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ ను తీసుకువచ్చింది. గ్రామాల్లో ఉండే మహిళలకు ఉపాధి కల్పించేందుకు 70 శాతం సబ్సిడీతో పాడి గేదెలు, ఆవులు ఈ పథకం ద్వారా అందిస్తారు. మహిళా సంఘాల్లో సభ్యులు ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. పాడి ఉత్పత్తి ద్వారా పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా.. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని దీనిని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే పాలకొరత ఏర్పడింది. దీనిని అధిగమించడంతోపాటు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఇవ్వాలని దీనిని ప్రవేశపెట్టారు. గ్రామాల్లోని నిరుద్యోగులకు, మహిళలకు దీని ద్వారా ఉపాధి కల్పించడం ఈ పథకం లక్ష్యం.
‘ ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ ద్వారా పాడి ఆవులు లేదా గేదెలు కొనుగోలు చేయడానికి ఒక్కో యూనిట్ ధర రూ.2 లక్షలు అవుతుంది. ఇందులో 70% అంటే రూ.1.40 లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా తీసుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులను లక్ష్యంగా చేసుకొని దీనిని ప్రవేశపెట్టారు. అలాగే పశుగ్రాసం, పశు వైద్యం, పాల సేకరణ విషయంలో మార్కెటింగ్ అవకాశాలను కూడా కల్పిస్తారు. మధిర నియోజకవర్గంలో ఇది విజయవంతం అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉంది.
గ్రామాల్లోని మహిళలు వ్యవసాయంతో పాటు, పాడి పరిశ్రమ కూడా ఏర్పాటు చేసుకోవడంతో అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా మహిళల్లో చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. వీరికి స్వయం ఉపాధి కల్పించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయవచ్చని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టు కోసం రూ. 781.82 కోట్ల ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భాగంగా మధిర నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు సక్సెస్ కావడానికి ఇప్పటికే రూ. 286 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. మరో రూ. 124.92 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులు కూడా లభించాయి.