Telangana Election Results 2023: ఖమ్మంలో 9, నల్లగొండలో స్వీప్.. తెర వెనుక బొచ్చెడు కారణాలు

గత రెండు పర్యాయాలు కూడా ఖమ్మం జిల్లా భారత రాష్ట్ర సమితికి లొంగిపోలేదు. 2014లో కొత్తగూడెం స్థానంలో జలగం వెంకట్రావు, 2018లో ఖమ్మం స్థానంలో పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే విజయం సాధించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 3, 2023 3:06 pm

Telangana Election Results 2023

Follow us on

Telangana Election Results 2023: ఒక జిల్లాలో 9 నియోజకవర్గాలు, మరొక జిల్లాలో 12 నియోజకవర్గాలు.. స్థూలంగా చూస్తే 21 స్థానాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. రాష్ట్రం మొత్తం ఒకెత్తయితే.. ఈ రెండు జిల్లాల్లో మాత్రం మరో విధంగా అన్నట్టుగా సాగింది. ఫలితంగా 12 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది.. రాష్ట్రంలో ప్రస్తుతం 60 కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఆ స్థానాల్లో సింహభాగం ఈ రెండు జిల్లాల నుంచే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి.. అయితే రాష్ట్రం మొత్తం ఒకెత్తయితే ఈ రెండు జిల్లాల్లో మాత్రమే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎదురేలేదు అనే తీరుగా ఎందుకు దూసుకుపోయింది? అంటే దీని వెనుక చాలా కారణాలున్నాయి.

ఖమ్మం జిల్లాలో..

ఇప్పుడే కాదు గత రెండు పర్యాయాలు కూడా ఖమ్మం జిల్లా భారత రాష్ట్ర సమితికి లొంగిపోలేదు. 2014లో కొత్తగూడెం స్థానంలో జలగం వెంకట్రావు, 2018లో ఖమ్మం స్థానంలో పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే విజయం సాధించారు. ప్రస్తుతం ఎన్నికల్లో భద్రాచలం స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి తరఫున తెల్లం వెంకట్రావు మాత్రమే అసెంబ్లీకి వెళ్ళనున్నారు. అంటే ఈ లెక్కన ఖమ్మం జిల్లా భారత రాష్ట్ర సమితికి ఎప్పటికప్పుడు బ్రేక్ వేస్తూనే ఉంది. అయితే ఈ దఫా ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దానిని ఖమ్మం జిల్లా ప్రజలు అందిపుచ్చుకున్నారు. అంతేకాదు భారత రాష్ట్ర సమితి నాయకులను ఓడించారు. ఇందులో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఉండటం విశేషం. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకుల ఒంటెత్తు పోకడలు సహజంగానే ఇక్కడి ప్రజలకు నచ్చలేదు. అందుకే ఏకంగా 9 మంది భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ఓడించి తీర్చుకున్నారు. అయితే వీరిలో ఎక్కువ శాతం టిడిపి ఓట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బదిలీ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందు నుంచి చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వచ్చారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు భారత రాష్ట్ర సమితిని ఇబ్బందుల్లో పెట్టాయి. ఈ జిల్లాలో సహజంగా కమ్మ ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసినప్పుడు కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడటం ఇక్కడి కమ్మ సామాజిక వర్గం ఓటర్లకు నచ్చలేదు. అందుకే వారంతా మూకుమ్మడిగా చేతికి జై కొట్టారు.

ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014, 18 ఎన్నికల్లో ఫలితాలు కొంతమేర భారత రాష్ట్ర సమితికి అనుకూలంగానే వచ్చాయి. అయితే 2023 కు వచ్చేసరికి ఆ ఫలితాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. ముఖ్యంగా అధికార భారత రాష్ట్ర సమితికి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఇక్కడ గెలవలేకపోవడం విశేషం. మంత్రి జగదీష్ రెడ్డి తో సహా చాలామంది ఉద్దండులైన నాయకులు ఇక్కడ ఓటమిపాలయ్యారు. మిర్యాలగూడ, కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట వంటి నియోజకవర్గాల్లో టిడిపి ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బదిలీ అయింది. సో అది అంతిమంగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ఓడిపోయేలా చేసింది. మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఫలితాలు రివర్స్ రావడంతో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితిలో అంతర్మథనం మొదలైంది. దశాబ్దంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఉత్సాహం ఉరకలెత్తుతోంది.