Telangana Destination Wedding Hub: నేటి తరానికి పెళ్లి అంటే కేవలం ఒక వేడుక కాదు.. అది జీవితంలోని గుర్తుండిపోయే అనుభవం కావాలి. అందుకే యువజంటలు సంప్రదాయ హాల్ లేదా గుడి వివాహాలకు బదులు ప్రకృతి, విలాసం, ప్రశాంతత కలగలిసిన ప్రదేశాలను కోరుకుంటున్నారు. పెళ్లి వేడుకను స్మరణీయంగా మార్చాలనే ఆకాంక్ష ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు బలమైన పునాది అయింది.
తెలంగాణ డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్..
గతంలో గోవా, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు పెళ్లి ప్రదేశాల ప్రధాన గమ్యస్థానాలుగా ఉన్నప్పటికీ, ఇప్పుడు తెలంగాణ కూడా ఆ జాబితాలో చోటు సంపాదిస్తోంది. రాష్ట్ర పర్యాటక శాఖ దీనిని ప్రణాళికాత్మకంగా అభివృద్ధి చేస్తోంది.
అనంతగిరి అడవులు (వికారాబాద్)..
ప్రకృతి సోయగాలు, అందమైన కొండలు, ప్రశాంత వాతావరణం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇక్కడ లగ్జరీ రిసార్టులు, వివాహ వేదికలు, ఫొటోగ్రఫీ స్పాట్లు రూపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.
గోల్కొండ ప్రాతం..
చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ ప్రాంతంలో తారామతి బారాదరిలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం జరగనుంది. ఇది వైభవంగా వివాహ వేడుకలు జరపడానికి అన్నివిధాలుగా అనుకూలం.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్..
ప్రకృతి మాదిరిగా లగ్జరీ అనుభూతిని ఇచ్చే రిసార్టులు ఇక్కడ ప్రతిష్టించబడతాయి. ప్రకతి మధ్యలో వివాహం అనే ఆలోచన పర్యాటకులకు అదనపు ఆకర్షణ.
నాగార్జునసాగర్ బుద్ధవనం..
ఆధ్యాత్మిక వాతావరణం కలిగిన ఈ ప్రాంతంలో ధ్యాన కేంద్రాలు, ఎకో రిసార్టులు ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
ఉపాధి అవకాశాలు..
ఈ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 30 ఎంఓయూలు కుదుర్చింది. వీటి ద్వారా సుమారు 30 వేల మందికి పైగా నేరుగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. పర్యాటక రంగానికి ఇది ఒక పెద్ద మలుపు కాబడనుంది. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు, వెడ్డింగ్ టూరిజం ద్వారా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే తెలంగాణ కేవలం ఐటి కేంద్రమే కాకుండా హెరిటేజ్, నేచర్ మరియు లగ్జరీ వెడ్డింగ్ టూరిజం రంగాల్లో కూడా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక్కడి అడవులు, సరస్సులు, చారిత్రక కట్టడాలు కలగలసి తెలంగాణను ‘‘వివాహ గమ్యం’’గా మలచగలవని నిపుణులు విశ్లేషిస్తున్నారు.