Telangana Congress : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు దాటింది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. కానీ పార్టీలో పదవుల నియామకంపై ఇటు పీసీసీ చీఫ్(T PCC chief), అటు సీఎం దృష్టి పెట్టలేదు. తాజాగా టీపీసీసీ పదవుల భర్తీకి కసరత్తు మొదలు పెట్టారు. ఈ సందర్భంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కొత్త కార్యవర్గ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. గతంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కని నాయకులకు కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్ వంటి పదవులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఇతర బీసీ వర్గాల నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంప్రదించి అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే ప్రక్రియ జరుగుతోంది.
Also Read : రెండోసారీ నేనే ముఖ్యమంత్రి… రేవంత్ రెడ్డిలో అంత కాన్ఫిడెన్స్ ఏంటి?
పదేళ్లు పార్టీ కోసం పనిచేస్తేనే..
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) రాష్ట్ర కార్యవర్గంలో చేరాలంటే గత పదేళ్లలో పార్టీ కోసం చేసిన కృషిని ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. కొందరు నాయకులు ఈ పదవుల కోసం తీవ్రంగా లాబీయింగ్(Labeing) చేస్తున్న నేపథ్యంలో ఈ కొత్త నియమాన్ని అమల్లోకి తెచ్చినట్లు సమాచారం. పదవుల కోసం దరఖాస్తు చేసుకునే నాయకులు తమ బయోడేటాలో 2015 నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కోసం చేసిన పనుల వివరాలను పేర్కొనాలని ఏఐసీసీ(AICC) తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్(Menakshi Natarajan) స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎవరికి పడితే వారికి పీసీసీ పదవులు ఇవ్వొద్దని ఆమె ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి పీసీసీ కొత్త కార్యవర్గం కోసం నాయకుల పేర్లతో ప్రతిపాదనలు సిద్ధం కానున్నాయని సమాచారం. ఇందుకోసం జిల్లాల వారీగా నాయకుల పనితీరుపై వివరాల సేకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ బాధ్యతను ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ పదవే కావాలి
కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్(Working Prasident) పదవి కోసం గట్టిగా పోటీపడుతున్నారు. ప్రతి సామాజిక వర్గానికి ఒకటి చొప్పున కనీసం నాలుగు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ పదవి తప్ప, మిగతా పదవుల కోసం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ‘నేను పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాను. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే మరింత అంకితభావంతో పనిచేస్తాను‘ అని ఎంపీ బలరాం నాయక్ తెలిపారు. పార్టీ ఏ పదవి ఇచ్చినా చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన ఇప్పటికే ఏఐసీసీకి తెలియజేసినట్లు వివరించారు. అలాగే, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ పదవి కోసం పోటీలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి కోసం కూడా కొందరు జిల్లా నాయకులు అడుగుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లభిస్తుందనడానికి ఇటీవల నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ఒక ఉదాహరణ అని ఒక ముఖ్య నాయకుడు తెలిపారు. ఈ ఎమ్మెల్సీ టికెట్ కోసం పలువురు ప్రముఖ నాయకులు పోటీపడినప్పటికీ, పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందనే సందేశాన్ని ఏఐసీసీ పంపినట్లు ఆయన వివరించారు.
24 నుంచి సమీక్షలు
ఈ నెల మొదటి వారంలో కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలపై మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మిగిలిన నియోజకవర్గాల వారీగా పార్టీ పనితీరుపై ఈ నెల 24 నుంచి సమీక్షలు జరపనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమీక్షల కోసం నాయకులు గాంధీ భవన్‌కు రావాలని ఆమె ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షల ద్వారా పీసీసీ పదవులకు నాయకుల ఎంపిక దాదాపు ఖరారు కానుందని అంచనా. ‘పనిచేసే వారినే పీసీసీకి ఎంపిక చేస్తాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు‘ అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజల్లో ఉంటూ పనిచేసే నాయకులను పదవుల్లోకి తీసుకొచ్చి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఏఐసీసీ సూచించినట్లు ఆయన వెల్లడించారు.
Also Read : నిజమైన జర్నలిస్టులు ఎవరో తేల్చాలి.. తప్పుడు కథనాలు రాసే నాన్ జర్నలిస్టులు క్రిమినల్సే..!