Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) పార్టీలో మంత్రి పదవుల కోసం నాయకుల మధ్య తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే.. ఇబ్బందులు తప్పవు అని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)అధ్యక్షతన సీఎల్పీ అత్యవసర భేటీ మంగళవారం(ఏప్రిల్ 15, 2025 ఉదయం 11 గంటలకు) శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించారు. మంత్రివర్గ విస్తరణ, నాయకుల మధ్య విభేదాలు, పార్టీలో అంతర్గత ఐక్యత లాంటి కీలక అంశాలపై చర్చించే అవకాం ఉంది.
Also Read: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. 55,418 పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచింది. కానీ, ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. 2023 డిసెంబర్ 7న సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మరో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు(Cabinate expansion) ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్త మంత్రి పదవుల కేటాయింపు కోసం సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. కొందరు నాయకులు ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటూ పార్టీలో అసంతృప్తి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సీనియర్ నాయకుడు జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
వివేక్‌పై ప్రేమ్ సాగర్ ఆగ్రహం..
మంచిర్యాల జిల్లాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌పై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవుల కేటాయింపులో వివేక్ తనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ వివాదం స్థానికంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరి మధ్య విభేదాలు పార్టీ ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నల్గొండ నాయకులపై దామోదర్ విమర్శలు
మంత్రి దామోదర రాజనర్సింహ కూడా నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ హెలికాప్టర్ లేకుండా జిల్లాలో అడుగుపెట్టడం లేదని, స్థానిక కార్యకర్తలతో సమన్వయం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య చిచ్చు రేపే అవకాశం ఉంది.
మల్‌రెడ్డి రంగారెడ్డి రాజీనామా బెదిరింపు
రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకుడు మల్‌రెడ్డి, తనకు మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తానని బహిరంగంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మల్‌రెడ్డి రాజీనామా బెదిరింపు సీఎల్పీ సమావేశంలో కీలక చర్చనీయాంశంగా మారింది.
సమస్యల పరిష్కార యత్నం
మంత్రివర్గ విస్తరణ విషయంలో నాయకుల మధ్య విభేదాలు తలెత్తడంతో, సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసంతృప్త నాయకులను బుజ్జగించడం, పార్టీలో ఐక్యతను కాపాడటం కోసం ఆయన హైకమాండ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. సీఎల్పీ(CLP) సమావేశంలో ఈ వివాదాలన్నింటినీ చర్చించి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి స్పష్టమైన రూపురేఖలను రూపొందించే అవకాశం ఉంది.
పార్టీ ఐక్యతపై ప్రభావం
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్న నేపథ్యంలో, నాయకుల మధ్య ఈ విభేదాలు ప్రభుత్వ పనితీరుపై, పార్టీ ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మంత్రి పదవుల కోసం జరుగుతున్న ఆధిపత్య గొడవలు కార్యకర్తల ఉత్సాహాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని, వీటిని త్వరగా పరిష్కరించకపోతే భవిష్యత్ ఎన్నికల్లో పార్టీకి నష్టం వాటిల్లవచ్చని అభిప్రాయపడుతున్నారు.