Revanth Reddy shock Ponguleti: ఇన్నాళ్లపాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రతిపక్ష గులాబీ పార్టీ మాత్రమే టార్గెట్ చేసేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ జాబితాలో చేరిపోయినట్టు కనిపిస్తోంది. ఆమధ్య జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డిని విమర్శించారు. కొండ సురేఖ కుమార్తె కూడా రెవెన్యూ మంత్రిపై ఆరోపణలు చేసింది.. ఇవన్నీ ఒకరకంగా శ్రీనివాస్ రెడ్డి రాజకీయ జీవితానికి ఇబ్బందికరంగా మారాయి. పైగా ఆయన ఖమ్మం జిల్లాపై కాకుండా.. ఇటీవల ఉమ్మడి వరంగల్ పై దృష్టి పెట్టారు. సహజంగానే అది ఇక్కడికి కాంగ్రెస్ నాయకులకు ఇబ్బందికరంగా మారింది. బయటపడక పోయినప్పటికీ.. శ్రీనివాస్ రెడ్డి మీద ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఇక ఇటీవల శ్రీనివాసరెడ్డి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పై గులాబీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. నార్సింగి, మంచి రేవుల మధ్య ఉన్న ప్రాంతంలో రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ చేపడుతున్న పనులను వారు పరిశీలించారు. రాఘవ కంపెనీ అక్రమంగా మైనింగ్ చేపడుతోందని ఆరోపించారు. విలువైన వనరులు మొత్తం ఆ కంపెనీ దక్కించుకుందని.. వందల కోట్ల అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దీనిపై శ్రీనివాస్ రెడ్డి వివరణ కూడా ఇచ్చారు. అయినప్పటికీ గులాబీ నేతలు విమర్శలు చేయడం ఏమాత్రం తగ్గించలేదు.
Also Read: అక్కా.. కేసులు వెనక్కి తీసుకో.. పాపం రేవంత్ రెడ్డిది మామూలు బాధ కాదు పో..
అప్పట్లో శ్రీనివాస్ రెడ్డి కుమారుడు సింగపూర్ ప్రాంతం నుంచి నిషేధిత వస్తువులను దిగుమతి చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దానిపై కేంద్ర దర్యాప్తు బృందాలు కేసు కూడా నమోదు చేశాయి. ఇక శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పలు భూవివాదాలలో విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో శ్రీనివాస్ రెడ్డి కుమారుడిపై కేసు నమోదు చేసిన ఓ పోలీసు అధికారి బదిలీ అయ్యారు. దీనిపై కూడా రాజకీయంగా కలకలం ఏర్పడింది. అనేక సందర్భాలలో శ్రీనివాస్ రెడ్డి తన కుమారుడి మీద.. తన కంపెనీ మీద వస్తున్న ఆరోపణలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి.
ఇక తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కీలక ప్రకటన చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రెడ్డి.. రాజ్యసభ సభ్యుడు, గులాబీ పార్టీ కీలక నేత వద్దిరాజు రవిచంద్ర కు చెందిన మైనింగ్ కంపెనీల పై సి బి సి ఐ డి విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. శ్రీనివాస్ రెడ్డి కంపెనీపై కూడా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇన్నాళ్లపాటు శ్రీనివాసరెడ్డి కంపెనీ పై గులాబీ పార్టీ నేతలు విమర్శలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా విచారణకు ఆదేశించడంతో.. తాము చేసినవి ఆరోపణలు కాదని.. నిజాలని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు వద్దిరాజు రవిచంద్ర.. గంగుల కమలాకర్ కంపెనీలపై విచారణకు ఆదేశించడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రవిచంద్ర.. కమలాకర్ కంపెనీలు సాగించిన అక్రమ మైనింగ్ లో నిజాలు బయటపడాలని.. ఆ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.