Telangana Cabinet Expansion : ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ శాఖల కేటాయింపు జరగలేదు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన వెళ్లిపోయారు. పార్టీ హై కమాండ్ నుంచి పిలుపు రావడంతో వెంటనే స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళిపోయారు. మొత్తంగా అనేక రకాల చర్చలు, సంప్రదింపుల తర్వాత ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. గత మూడు రోజులుగా సాగుతున్న ఈ వ్యవహారం గురువారం నాటికి ఒక కొలిక్కి వచ్చింది. దీంతో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మంత్రులకు సంబంధించిన శాఖలను బయటికి వెల్లడించారు.
వాస్తవానికి ఈ ముగ్గురు మంత్రులకు రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న శాఖలలో కొన్నింటిని ఇచ్చే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరిగింది. కొన్ని శాఖలు ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయి. వీటిని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారని తెలిసింది. ఏం జరిగిందో తెలియదు గానీ.. తన వద్ద ఉన్న ఆ శాఖలను ముగ్గురు కొత్త మంత్రులకు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఆసక్తిని ప్రదర్శించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో గడ్డం వివేక్ కు మైనింగ్, కార్మిక శాఖలు కేటాయించారు. వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన, పశు సంవర్దకశాఖలు కేటాయించారు. లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టి, మైనారిటీ సంక్షేమ శాఖలు కేటాయించారు.. ముగ్గురు మంత్రులు రేపు లేదా ఎల్లుండి తమ ఛాంబర్లలో ప్రవేశించే అవకాశం ఉంది. అధికారికంగా మంత్రులుగా చార్జ్ తీసుకుంటారని తెలుస్తోంది. మలి దశ విస్తరణలో అధిష్టానం మీద ఆగ్రహంగా ఉన్న వారికి మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు అధిష్టానం మీద ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే వీరు మంత్రి పదవులు వస్తాయని భావించారు. వీరిలో సుదర్శన్ రెడ్డి సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవల విస్తరణలో ఆయనకు చోటు లభిస్తుందని అందరూ అనుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయనకు గట్టి భరోసా ఇచ్చారు. కానీ చివరి దశలో అధిష్టానం అడ్డు పుల్ల వేయడంతో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో వ్యాఖ్యానించిన తెలిసింది. ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం సుదర్శన్ రెడ్డితో మాట్లాడి.. ఆయనను సముదాయించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ సుదర్శన్ రెడ్డి అధిష్టానం మీద ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.