AP Journalist Krishnaraju Arrest : వైసిపి అనుకూల ఛానల్ లో నిర్వహించిన డిబేట్లో కృష్ణంరాజు అమరావతి రాజధాని *** నిలయమని.. ఇటీవల జాతీయ సర్వేలో కూడా అదే విషయం వెళ్లడైందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో సాక్షిలో డిబేట్ నిర్వహిస్తున్న జర్నలిస్టు శ్రీనివాసరావు కృష్ణంరాజు వ్యాఖ్యలకు వంత పాడారు. తాను కూడా ఇటీవల జాతీయ మీడియాలో ప్రచురితమైన కథనాలను చూశానని వ్యాఖ్యానించారు..” మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.. రేపటి రోజున సోషల్ మీడియాలో మీ మీద విమర్శలు చేస్తారు.. రెచ్చిపోతారు జాగ్రత్త” అంటూ కృష్ణంరాజుకు శ్రీనివాసరావు సూచించారు. అయినప్పటికీ కృష్ణంరాజు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. అంతేకాదు పైగా మరింత రెచ్చిపోయారు. అదే స్థాయిలో వ్యాఖ్యలు చేసుకుంటూ వెళ్లారు. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనికి తోడు అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన మహిళలు నిరసన వ్యక్తం చేశారు. కృష్ణంరాజు, జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాసరావు ఫోటోలను పాదరక్షలతో కొట్టారు. తుళ్లూరు పోలీసులకు వారి మీద ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో వారు కోరారు.
కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో మంటలు పుట్టించాయి. అంతేకాదు ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే మీడియా కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల మీద ప్రత్యేకంగా డిబేట్లు.. కథనాలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలలో అగ్గిరాజుకుంది. ఇక అమరావతి ప్రాంత మహిళలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ఆంధ్ర ప్రదేశ్ తీసుకొచ్చారు. విజయవాడలో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రకారం పోలీసులు ఆయనను విచారణ ఖైదీగా జైలుకు తరలించారు. దీంతో శ్రీనివాసరావు జ్యుడీషియల్ ఖైదీగా జైలుకు వెళ్లారు. ఇక ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. ఆయనను వెతికి పట్టుకోవడానికి ఏపీ పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు మొదలుపెట్టారు. చివరికి ఆయనను గురువారం రాత్రి విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆయనను విజయవాడ తీసుకొస్తున్నారు. విజయవాడ తీసుకొచ్చిన తర్వాత న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. న్యాయమూర్తి వెలువరించిన నిర్ణయం ప్రకారం పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ కేసులో శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన విచారణ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఇప్పుడు కృష్ణంరాజు కూడా పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో.. ఆయనను కూడా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి.. అనంతరం పోలీసులు జైలుకు తరలిస్తారని ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే జైలు వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ప్రత్యేక బృందాలు రోడ్డు మార్గం ద్వారా కృష్ణంరాజును విజయవాడ తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత కృష్ణంరాజు పరారీలో ఉండగా.. అతడి కోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. చివరికి విశాఖపట్నంలో ఆయన ఆచూకీ తెలుసుకొని అదుపులోకి తీసుకున్నాయి. అమరావతి రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత కృష్ణంరాజుపై విమర్శలు పెరిగిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో కృష్ణంరాజు ఒక స్వీయ వీడియో విడుదల చేశారు. అందులో కూడా ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేయడంతో.. మరింత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఏపీ పోలీసులు అరెస్టు వార్తను బయట పెట్టిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. క్షమాపణ చెప్పినప్పటికీ ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటని మండిపడుతున్నాయి.