Telangana Cabinet Expansion: 12 నియోజకవర్గాలు ఉన్న కరీంనగర్ జిల్లాలో.. ఐదు స్థానాలలో గులాబీ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కరీంనగర్లో గంగుల కమలాకర్, సిరిసిల్లలో కేటీఆర్, హుజరాబాద్ లో కౌశిక్ రెడ్డి, జగిత్యాలలో డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్లలో డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ విజయం సాధించారు.. ఇక మిగతా నియోజకవర్గాలైన ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్, రామగుండం రాజ్ ఠాకూర్, మంథని శ్రీధర్ బాబు, చొప్పదండి మేడిపల్లి సత్యం, వేములవాడ ఆది శ్రీనివాస్, మానకొండూరు కవ్వంపల్లి సత్యనారాయణ విజయం సాధించారు. వాస్తవానికి ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కంటే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి తక్కువగానే స్థానాలు ఇచ్చింది. ఈ జిల్లాలో మొత్తం 12 స్థానాలు ఉంటే.. ఏడు స్థానాలలో హస్తం పార్టీ నాయకులు విజయం సాధించారు.. ఈ ప్రాతిపదికన చూసుకుంటే ఈ జిల్లాకు ఒకరిని మంత్రి చేయడమే సబబు. కానీ అది కాంగ్రెస్ పార్టీ కదా.. ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చింది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మంత్రులుగా కొనసాగుతుండగా.. కొత్తగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మంత్రి పదవి కేటాయించడం సంచలనం కలిగిస్తోంది.. వాస్తవానికి ఈ జిల్లా నుంచి ముగ్గురిని మంత్రులుగా నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: తెలంగాణ లో మంత్రివర్గ విస్తరణ: కొత్త మంత్రులుగా వీరే..
2014, 2018 లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గులాబీ పార్టీ హవా వీచింది. ఈ జిల్లా నుంచి చాలామందికి మంత్రి పదవులు లభించాయి. ఒకరకంగా సామాజిక సమతూకాన్ని, ఇతర విషయాలను పరిగణనకు తీసుకున్న నాటి భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాకు సముచిత ప్రాధాన్యం కల్పించింది. కానీ ఏడు స్థానాలకు వచ్చిన ఈ జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు కేటాయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఈ జిల్లాలో కరీంనగర్ పార్లమెంటు స్థానం గా ఉంది. ఈ పార్లమెంటు స్థానంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీగా బిజెపికి చెందిన బండి సంజయ్ విజయం సాధించారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించలేకపోయారు. భారతీయ జనతా పార్టీ కి 2023 ఎన్నికల్లో ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవక పోయినప్పటికీ.. 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీ అభ్యర్థి విజయం సాధించడం విశేషం.
ఇక ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వర్గపోరు నడుస్తోంది. నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మంత్రుల మధ్య కూడా గ్యాప్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ జిల్లాలో రెండు పవర్ హౌస్లు ఏర్పడ్డాయి. తాజాగా మూడో పవర్ హౌస్ ఏర్పాడటానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. “గతంలో అనేక పర్యాయాలు ఓడిపోయిన వ్యక్తికి తొలి కేబినెట్ లో మంత్రి పదవి కేటాయించారు. ఇప్పుడు కూడా సామాజిక సమతూకం అని పైకి చెబుతూ మరొక వ్యక్తికి మంత్రి పదవి కేటాయిస్తున్నారు. ఏడు స్థానాలు గెలిచిన జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం ఏంటని” నాయకులు అధిష్టానాన్ని విమర్శిస్తున్నారు. మరి ఏ ప్రాతిపదిక ఆధారంగా అధిష్టానం ఈ జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులో ఇచ్చిందో కాలం గడిస్తే గాని తెలియదు. అన్నట్టు ఇటీవల ఈ జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలు కావడం విశేషం.