Telangana BJP
Telangana BJP: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి నిర్ణయాలతో సామాజిక వర్గాలను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణలో అలర్ట్ అయింది. పార్టీకి కొత్త సారథిని నియమించే పనిలో పడింది.
Also Read: హైదరాబాద్ జీవన వ్యయం.. బతకడానికి ఎంత కావాలో తెలుసా?
దక్షిణాదిన బీజేపీకి పట్టు చిక్కడం లేదు. కర్ణాటక(Karnataka) మినహా ఎక్కడా అధికారంలోకి రాలేదు. అయితే పట్టు కోసం మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గతేడాది జరిగిన ఆంధ్రప్రదేశ్(Andrea Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. విజయం సాధించాయి. దీంతో ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ(Telangana)పైనా బీజేపీ దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ 8 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తోంది ఏపీలో అమలు చేసిన వ్యూహం అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో ఊహించని రాజకీయ సమీకరణలు తెరపైకి వస్తున్నాయి.
హస్తినలో కసరత్తు..
దక్షిణ భారతం(south India)లో తెలంగాణ నుంచి తమ ఆపరేషన్‌ను ప్రారంభించాలని బీజేపీ భావిస్తోంది. ఈ లక్ష్యంతో ఢిల్లీలో చర్చలు జరిగి, కొత్త అధ్యక్షుడి నియామకంపై త్వరలో ప్రకటన వెలువడనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో మరో 8 సీట్లు సాధించిన బీజేపీ, సామాజిక సమీకరణల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో బీసీ సీఎం నినాదంతో బీజేపీ ప్రచారం చేసినప్పటికీ, ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం ఆచితూచి అడుగులు వేస్తోంది. బండి సంజయ్ స్థానంలో కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత, పార్టీలో కీలక మార్పులకు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని వర్గాలను కలుపుకొని నడిపే నాయకుడిని ఎన్నుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో ముదిరాజ్ వర్గానికి చెందిన ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajendar) పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా, మురళీధర్ రావు, డీకే అరుణల పేర్లు కూడా ఆకస్మికంగా తెరపైకి వచ్చాయి. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఉండటంతో రెడ్డి వర్గానికి అవకాశం తక్కువనే అభిప్రాయం ఉంది. దీంతో బీసీ వర్గానికే అధ్యక్ష పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.
స్పందించిన బండి సంజయ్..
ఇదే సమయంలో బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై దొంగ నోట్ల ముద్రణ ఆరోపణలు చేసిన ఆయన, తాను అధ్యక్ష రేసులో లేనని, ఇస్తే వద్దననని స్పష్టం చేశారు. గతంలో తాను అధ్యక్షుడిగా చేసిన పనితనాన్ని నిరూపించానని, కొందరు స్వప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
అధిష్టానం పిలుపు..
ఇదిలా ఉంటే.. తెలంగాణ అధ్యక్షుడి ప్రకటన కోసం బీజేపీ తెలంగాణలోని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి(Kishan Reddy), బండి సజంయ్‌ను హఠాత్తుగా ఢిల్లీకి పిలిచింది. దీంతో ఇద్దరు మంత్రులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెల్లారు. ఈ పరిణామాలతో బీజేపీ తుది నిర్ణయం ఎటువైపు మళ్లుతుందనే ఉత్కంఠ నెలకొంది.