https://oktelugu.com/

Telangana BJP: తెలంగాణలో బీజేపీ డబుల్ గేమ్.. కీలక నేతలంతా మౌనరాగం.. అసలు కథేంటి..?

తెలంగాణ బీజేపీ నేతలంతా మౌనరాగం ఎత్తుకున్నట్లు కనిపిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో అంతా కలిసికట్టుగా పోరాడగా, ప్రస్తుతం ఒక్కో నేత ఒక్కోలా స్పందిస్తున్నారు. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతున్నదనే చర్చ జోరుగా సాగుతున్నది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 7, 2024 12:50 pm
    Class war in Telangana BJP
    Follow us on

    Telangana BJP: తెలంగాణలో బీజేపీ గతంలో కంటే బలంగా ఉంది. బీఆర్ఎస్ ఓటమి దరిమిలా ఇటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ సీట్లను పెంచుకుంది. అయితే కీలక నేతలు మాత్రం కొంత సైలెంట్ గా ఉంటున్నారు. గతంలో కేసీఆర్ సర్కారుపై విశ్వరూపం చూపించిన నేతలు కూడా ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో సహా నిజామాబాద్ ఎంపీ డీ అర్వింద్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రేవంత్ సర్కారు పై అసలు నోరు మెదపడం లేదు. తూతూ మంత్రంగా విమర్శలు గుప్పిస్తున్నా, అవి గతంలోలా మాత్రం లేవు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ సర్కారు నడుస్తున్నదని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న పలు ఘటనల నేపథ్యంలో అసలు కీలక నేతలంతా స్పందించడం లేదు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాత్రమే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏ విషయంలో కూడా బీఆర్ఎస్ కు మైలేజీ రాకుండా వారు విపరీత ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్, హరీశ్ రావులకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ నేరుగా రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తున్నది.

    కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఉన్న బండి సంజయ్, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రాష్ర్ట సర్కారుపై విమర్శలు చేయడం లేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇక రేవంత్ సర్కారు విషయంలో మూసీ సుందరీకరణ, హైడ్రా, నిరుద్యోగుల పోరాటం అంశంలో మాత్రం బీఆర్ఎస్ కు మైలేజీ దక్కకుండా బీజేపీ కీలక నేత బండి సంజయ్ ప్రయత్నం చేశారు. ఆయన నేరుగా బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడారు. మూసీ సుందరీకరణ మంచిదంటూనే బాధితులకు న్యాయం చేశాకే చేపట్టాలని కోరారు. కిషన్ రెడ్డి, అర్వింద్ కూడా ఇదే రీతిలో మాట్లాడారు. కాంగ్రెస్ పై కంటే బీజేపీ పైనే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు.

    ఇక పార్టీ ఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డి మాత్రం రేవంత్ సర్కారు పై విరుచుకుపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటల మోస్తున్నారని, ఆయన పదవి కొద్ది రోజుల్లో ఊడడం ఖాయమని మరోసారి విమర్శించారు. ఇక రేవంత్ ను కలిసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం చూపడం లేదంటూ మరో బాంబు పేల్చారు. కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ఒక అడుగు ముందుకేసి ఏకంగా రాహుల్ గాంధీ పై కూడా ఆయన విమర్శలు చేశారు. అసలు రాహుల్ కులం, మతం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. మహేశ్వర్ రెడ్డి మినహా మిగతా కీలక నేతలంతా అడపాదడపా మాత్రమే రాష్ర్ట సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

    అయితే కాంగ్రెస్ తో బీజేపీ దోస్తీ చేస్తున్నదని బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నది. బడే భాయ్, చోటే భాయ్ బంధం అంటూ ఎద్దేవా చేస్తున్నది. తెలంగాణలో రేవంత్ సర్కారుకు నరేంద్ర మోదీ సర్కారు ఆశీస్సులు ఉన్నాయంటూ చెబుతున్నది. ఏదేమైనా తెలంగాణలో ఎవరిస్థాయిలో వారు నాటకాన్ని రక్తికట్టిస్తున్నారు. అసలు ఎవరు ఎటువైపు ఉన్నారో అర్థం కాక జనాలు మాత్రం గొణుక్కుంటున్నారు. ఏదేమైన మిగతా రాష్ర్టాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులను నడిపిస్తున్న బీజేపీ తెలంగాణలో డబుల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు