Telangana BC Bandh: ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ప్రజాప్రతినిధులకు చెప్పుకుంటారు. ప్రజాప్రతినిధులే సమస్య అయితే మంత్రులకు చెబుతారు. మంత్రులు సమస్య అయితే ముఖ్యమంత్రికి చెబుతారు. అయితే ఇప్పుడు ప్రభుత్వమే సమస్య అయింది. 2023 ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతోంది. బీసీ గణన చేసి.. 42 శాతం రిజర్వేషన్లు కల్పించినా.. కోర్టులు అంగీకరించడం లేదు. దీంతో బీసీ సంఘాలు అక్టోబర్ 18న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. విపక్షాలు బంద్‌కు మద్దతు తెలిపాయి. ఇక విచిత్రం ఏమిటంటే బంద్‌కు అధికార కాంగ్రెస్ కూడా సంఘీభావం ప్రకటించింది. ఇదే ఇప్పుడు రాజకీయ చర్చల కేంద్రబిందువైంది. ఈ పరిస్థితిలో ‘‘బంద్ ఎవరిపై? రాష్ట్ర ప్రభుత్వానికా, కేంద్రానికా?’’ అన్న ప్రశ్న ప్రస్తుతం చర్చాంశంగా మారింది.
బంద్ ఎందుకు?
బీసీ సంఘాలు సంవత్సరాలుగా స్థానిక సంస్థల్లో తమకు తగిన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నాయి. ఈ అంశం మున్సిపల్, గ్రామ పంచాయతీ, జెడ్పీ ఎన్నికలలో ప్రాతినిధ్య సమస్యగా ఉంది ఉందని, 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌ను ఇప్పటికే ప్రభుత్వం చట్టపరంగా తీర్చలేకపోవడంతో సంఘాలు రోడ్డెక్కాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వైపు చూపుతూ, ‘‘రిజర్వేషన్ పరిమితిని 50% కంటే పెంచాలంటే పార్లమెంట్ చట్టాన్ని సవరించాలి’’ అని చెప్పగా, మరోవైపు కేంద్రం, ‘‘అది రాష్ట్ర పరిధిలోనే ఉంది’’ అని బాధ్యతను రాష్ట్రంపైనే వేస్తోందని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు.
అఖిలపక్ష మద్దతు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, బంద్‌కు ప్రతిపక్షాలు బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం సహా పలు ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఇది ఉద్యమానికి విశాలమైన ప్రజా మద్దతు తెచ్చిపెట్టినా, రాజకీయ స్పష్టత లోపించింది.
ఎందుకంటే అన్ని పార్టీలు ఒకే వేదికపై నిలబడితే, వ్యతిరేకి ఎవరు అనేది అన్న ప్రశ్న తలెత్తుతోంది. ‘‘ప్రతీ ఒక్కరూ మద్దతిస్తే ఈ పోరాటం ఎవరిమీద?’’ అన్న ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశమైంది.
రాజకీయ ఒత్తిడి సాధనా వ్యూహమా?
రాజకీయ విశ్లేషకుల దృష్టిలో, ఈ బంద్ నిజమైన లక్ష్యం ప్రభుత్వ మార్పు కాదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీసీ ఓటు బ్యాంకును కేంద్రీకరించడమే ముఖ్య ఉద్దేశ్యం. బంద్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాబోయే బడ్జెట్‌లో లేదా ఆర్డినెన్స్ రూపంలో రిజర్వేషన్ నిర్ణయం వెలువడేలా చేయాలన్న ప్రయత్నం కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ బంద్ ఒక చట్టపరమైన డిమాండ్ కంటే ఎక్కువగా, సామాజిక న్యాయం కోసం చేస్తున్న సంకేతాత్మక పోరాటంగా మారింది. ప్రజా మద్దతు విస్తృతంగా ఉన్నా, రాజకీయ స్పష్టత లేకపోవడంతో దీని నిష్పత్తి స్పష్టంగా లేదు. బీసీ హక్కుల ప్రశ్నకు సమాధానం ఇచ్చేది ఎవరో అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలింది.