https://oktelugu.com/

Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికలు : మాటల తూటాలు.. తెరపైకి కొత్త అంశాలు..

మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ సైతం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాపై కీలక వాఖ్యలు చేశారు. మొత్తంగా ఈసారి ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే పార్టీలు రాజకీయ కాక రేపాయి.

Written By: , Updated On : October 11, 2023 / 08:45 PM IST
Telangana Assembly Elections 2023

Telangana Assembly Elections 2023

Follow us on

Telangana Assembly Elections 2023 : ఎన్నికల సమయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే అయినా.. ఈసారి మాత్రం రాష్ట్రంలోని పరిస్థితులు ‘అంతకుమించి..’ అన్నట్లుగా ఉన్నాయి. ఆయా పార్టీలు ప్రత్యర్థి పార్టీల నేతల వ్యక్తిగత వ్యవహారాల నుంచి మొదలుకుని కొత్త కొత్త అంశాలను తెరపైకి తెస్తూ జనాన్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. వివిధ పార్టీల ముఖ్యనేతలు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ప్రతిపక్ష పార్టీల్లోని కొందరు నేతలు టికెట్లు అమ్ముకుంటున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. వారి పేర్లను కూడా ప్రస్తావిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై క్షేత్రస్థాయిలో జనం నుంచి మిశ్రమ స్పందన మాత్రమే వస్తోంది. మరోవైపు మూడు ప్రధాన పార్టీల్లో ప్రతి పార్టీ.. మిగిలిన రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందంటూ ప్రచారం చేస్తున్నాయి. దీంతో అసలు ఎవరు ఎవరితో జట్టు కట్టారన్న దానిపై జనంలో చర్చ మొదలైంది. ఇక ఈసారి ఎన్నికల్లో హంగ్‌ ఏర్పడుతుందనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతోపాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్ఎస్‌ మూలాలు ఉన్న వ్యక్తి అని, ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే ఎమ్మెల్యేలందరినీ తీసుకుని బీజేపీలోకి వెళ్తారంటూ బీఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తోంది. అధికార పార్టీకి ఢీ అంటే ఢీ అన్నట్టుగా కాంగ్రెస్‌ కూడా మాటల బాణాలు సందిస్తోంది. ఒకవేళ హంగ్‌ వస్తే బీఆర్‌ఎస్‌, బీజేపీ జట్టు కడతాయని, దానిని అడ్డుకోవాలంటే ప్రజలు కాంగ్రెస్ కు ఏకపక్షంగా విజయం కట్టబెట్టాలని కోరుతోంది. బీజేపీ కూడా గిరి గీసి బరిలో నిలబడతామంటోంది. ఎన్నికలు జరిగే వరకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులను రంగంలోకి దింపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ సైతం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాపై కీలక వాఖ్యలు చేశారు. మొత్తంగా ఈసారి ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే పార్టీలు రాజకీయ కాక రేపాయి.

మ్యానిఫెస్టోల చుట్టే రాజకీయం..

నవంబరులో జరగబోయే ఎన్నికలకు పార్టీలన్నీ మ్యానిఫెస్టోలపై దృష్టి కేంద్రీకరించాయి. అయితే ఈసారి కాంగ్రెస్‌ ఒక అడుగు ముందే వేసింది. ఇప్పటికే ‘ఆరు’ గ్యారంటీల పేరుతో మినీమ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఆశించిన స్థాయిలో ఆరు గ్యారంటీలు జనంలోకి ప్రబలంగా వెళ్తున్నాయని ఆ పార్టీ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో వాటిపై విస్తృత చర్చ జరుగుతుండడంతో ఇక ప్రధాన మ్యానిఫెస్టోపై దృష్టి సారించింది. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం అందించాలనేటువంటి పలు అంశాలపై పార్టీ పెద్దలు మేధోమథనం చేస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ మాత్రం ఇప్పటివరకూ మ్యానిఫెస్టోను ప్రకటించలేదు. అక్టోబరు 15న సీఎం కేసీఆర్‌ మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తమ మ్యానిఫెస్టోను చూసి ప్రతిపక్షాల మైండ్‌ బ్లాక్‌ అవుతుందంటూ డైలాగులు వదులుతున్నారు. ఇపుడున్న వాటికంటే కొత్త పథకాలు ప్రజలను ఆకర్షిస్తాయని అంటున్నారు.

మరోవైపు బీజేపీ కూడా మ్యానిఫెస్టోను పకడ్బందీగా రూపొందిస్తున్నట్టు చెబుతోంది. ఇప్పటివరకు ఉచిత విద్య, వైద్యం అనే అంశాలపైనే బలంగా ప్రచారం నిర్వహిస్తున్నా.. జనంలో వీటిపై పెద్దగా చర్చ జరగడం లేదు. దీంతో తమ మ్యానిఫెస్టోలో భారీ మార్పులు చేయడంతోపాటు పలు కీలక పథకాలను పొందుపరచాలని భావిస్తోంది. రాజకీయ పార్టీలు ‘ఇజ్జత్‌ కా సవాల్‌’ అన్నట్టు రూపొందిస్తున్న మ్యానిఫెస్టోలు ఎంతమేర ప్రజాభిమానాన్ని చూరగొంటాయన్నది వేచిచూడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.