Telangana 2047 Vision: హైదరాబాద్ విశ్వనగరంగా గుర్తింపు పొందింది. దీనిని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టింది. ఇదే సమయంలో క్యూర్, ప్యూర్, రేర్‡ పేరుతో రాష్ట్రాన్ని మూడు భాగాలు విభజించింది. ఈ నేపథ్యంలో హైదరాద్‌లో సొంత ఇళ్లు కొనడం భారంగా మారింది. హైదరాబాద్ చుట్టుపక్కల భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ’అఫర్డబుల్ హౌసింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పి. శ్రీనివాసరెడ్డి ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ’తెలంగాణ–2047 విజన్’ లక్ష్యాల్లో భాగంగా, మూడు ఆర్థిక జోన్‌లకు సంబంధించి సమగ్ర గృహ నిర్మాణ ప్రణాళికను అమలు చేస్తారు.
PURE జోన్‌లో కొత్త కాలనీలు
ఓఆర్‌ఆర్(ఔటర్ రింగ్ రోడ్), రాబోయే ట్రిపుల్ ఆర్(రీజనల్ రింగ్ రోడ్) మధ్య ఉన్న PURE (పెరీ–అర్బన్) ప్రాంతాలపై ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టింది. ఆదాయ స్థాయిపై ఆధారపడకుండా అందరికీ అందుబాటులో ఉండేలా, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ)తరహాలో పెద్ద ఎత్తున కొత్త కాలనీలను నిర్మించనున్నారు. ఈ కాలనీల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, పార్కులు, పాఠశాలలు వంటి పూర్తి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
సామాన్యులకు అందుబాటులో..
ఈ విధానం మధ్యతరగతి, సామాన్య ప్రజలకు చవక్కు ధరలో నాణ్యమైన ఇళ్లు అందించడమే లక్ష్యం. హైదరాబాద్‌లోని కేంద్రీకృత పట్టణీకరణకు బదులు, పరివర్తన ప్రాంతాల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ సమతుల్య పెరుగుదల సాధిస్తుంది. పెరిగే జనాభానికి సరిపడా సురక్షిత గృహాలు కల్పిస్తూ, భవిష్యత్ తరాల అవసరాలను దూరదృష్టితో తీర్చనున్నారు.
పట్టణ విస్తరణకు క్రమబద్ధీకరణ..
ఈ చర్యలు హైదరాబాద్ పరిధిలో భూసేకరణ ఒత్తిడిని తగ్గించి, దూర ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతాయి. గృహ నిర్మాణ రంగానికి కొత్త ఊపు దొరకడంతో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. మొత్తంగా, ఈ విధానం రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధికి మైలురాయిగా మారనుంది.