Amaravati: అమరావతి రాజధానికి( Amaravati capital ) చట్టబద్ధత కల్పించాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం పై విపరీతమైన ఒత్తిడి కూడా పెంచుతోంది. ఏపీ రాజధానిగా అమరావతిని చూపుతూ గెజిట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్లో ఆమోదించి చట్టబద్ధత కల్పించాలన్న ఆలోచనతో ఉంది. అయితే చిన్న చిన్న న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి. న్యాయశాఖ వద్దకు వెళ్లిన ఈ ఫైలు చిన్నచిన్న అభ్యంతరాలతో తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. దానిని సరిచేసి మరోసారి న్యాయశాఖ ఎదుట పెట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అమరావతికి ఏవేవో అడ్డంకులు వచ్చాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబరపడిపోతోంది. అమరావతి విషయంలో ప్రభుత్వానికి షాక్ తగిలిందని సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తోంది. అయితే ఆది నుంచి అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన అలానే ఉండేది. అయితే ఈ తరహా ప్రచారాన్ని పెద్దగా పట్టించుకునే వారు లేరు. కానీ అదే పనిగా ప్రచారం చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాక్షసానందం పొందుతోంది.
* ఉమ్మడి రాజధానిగా ఉండడంతో..
రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాజధాని( combined capital) అంశాన్ని విభజన చట్టంలోనే స్పష్టం చేశారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా నిర్ధారిస్తూ అందులో పేర్కొన్నారు. అయితే తాజాగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ కొన్ని అంశాలను పొందుపరిచారు. ఏపీకి అమరావతి రాజధానిగా నిర్ధారిస్తూ గెజిట్ నోటిఫికేషన్ రూపొందించారు. అయితే బిల్లులో రాష్ట్ర విభజన జరిగిన తరువాత నుంచి అమరావతిని రాజధానిగా చేసినట్లు చూపించారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల వరకు హైదరాబాద్ ఉంటుందని.. తరువాత మాత్రమే అమరావతి ఏపీకి రాజధాని అవుతుందని స్పష్టం చేశారు. ఆ చిన్నపాటి తప్పిదంతో కేంద్ర న్యాయశాఖ అభ్యంతరం తెలపడంతో దానిని సరి చేసే పనిలో ఉన్నారు అధికారులు. ఏకంగా అమరావతి రాజధానికి కేంద్ర న్యాయశాఖ మోకాలు అడ్డింది అంటూ ప్రచారం మొదలు పెట్టేసారు.
* ఆది నుంచి అంతే..
అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అభిప్రాయం ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అమరావతి అనేది చంద్రబాబు క్రెడిట్ ఖాతాలోకి వెళుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందింది. అలా పుట్టుకొచ్చిందే మూడు రాజధానులు. అయితే దానిని అమలు చేయడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత పురోగతి సాధించలేకపోయింది. కనీస ప్రయత్నం కూడా జరగలేదు. మూడు రాజధానులు అనేవి పురుడుబోసుకోలేదు. అటు అమరావతిని నిర్వీర్యం చేశారు. ఇటు మూడు రాజధానులను ఏర్పాటు చేయలేదు. ఈ పరిణామాల క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడింది. అయితే ఇప్పుడు కూటమి అమరావతి రాజధాని పై ఫోకస్ చేయడం.. వచ్చే ఎన్నికల నాటికి ఒక తుది రూపునకు వస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కరం. అందుకే అమరావతికి చిన్నపాటి ఇబ్బంది వచ్చినా భూతద్దంలో పెట్టి సంబరపడిపోతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంతకుమించి ఏమీ కనబడడం లేదు కూడా.