Ibrahimpur Sarpanch: నాయకుడు అంటే ఎక్కడి నుంచో ఊడి పడడు.. జనంలో నుంచి పుడతారు అంటారు. అన్యాయంపై పోరాడే వాడు.. అభివృద్ధి కోసం పరితపించేవాడు.. నేనున్నాను అంటూ ఆపదలో అండగా నిలిచేవాడు.. అన్యాయాన్ని ఎదురించేవాడు.. పోరాటాల్లో ముందుండి నడిపించేవాడు నాయకుడు అవుతాడు. అలాంటి నాయకులు అరుదుగా ఉంటారు. అలాంటి లీడర్‌కు కష్టం వస్తే జనం కూడా అతడికి అండగా ఉంటారు. అన్యాయంపై తిరగబడతారు. కానీ నేటి రాజకీయాల్లో ఇవి సినిమాల్లోనే కనిపిస్తాయి. మన సొసైటీలో కూడా అక్కడక్కడా కొందరు కనిపిస్తారు. అలాంటి లీడరే ఈ సర్పంచ్.
నువ్వెంత మంచోనివే బాలన్న..
తెలంగాణలో సర్పంచుల పాలన ముగిసింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు. అన్ని గ్రామాల్లో సర్పంచులకు వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కొంతమంది సర్పంచులు భవోద్వేగానికి లోనవుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం, ఇబ్రహీంపూర్ సర్పంచ్‌కు కూడా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఊరంతా తరలివచ్చింది. ఈ సందర్భంగా ఓమహిళా సోకం పెట్టి ఏడవడంతో సర్పంచ్ బాలన్న కూడా కంటతడి పెట్టుకున్నాడు.
అభివృద్ధిని తల్చుకుంటూ..
నువ్వెంత మంచోనివే బాలన్నో.. బాలన్నా.. నీ సర్పంచ్‌గిరి ఒడిసిపోవుడు ఏందే బాలన్నో.. బాలన్నా.. నీ తండ్రి నర్సన్న సర్పంచ్ అయినా.. అంతా నువ్వే నడిపించినవ్ కదనే బాలన్నో.. బాలన్నా.. నా మొగనికి పింఛన్ రాపించింది నువ్వే కదనే బాలన్నో.. ఓ బాలన్నా.. మా ఇంటి ముంగట కరంటు స్తంభం వేయించింది నువ్వే కదనే బాలన్నో.. బాలన్నా.. వాడకట్టుకు బోరింగు ఏసి నీళ్లల తిప్పలు తీర్చింది నువ్వే కదనే బాలన్నో.. నా బాలన్నా.. మా హనుమాండ్ల ఆడకట్టుకు నున్నటి రోడ్డు ఏపిత్తివి కదనే బాలన్నో.. నా బాలన్న.. మొన్ననే ఏరువడ్డ నా కొడుక్కు రేషన్ కార్డు ఇప్పిత్తివి కదనే బాలన్నో.. నా బాలన్న.. అంటూ కన్నీటి పర్యంతమైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
స్పందిస్తున్న నెటిజన్లు..
బాలన్నను పట్టుకుని ఏడుస్తున్న మహిళ వీడియో వైరల్ అవుతుండడంతో దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అసలు వాళ్ల నాన్న సర్పంచ్ అయితే ఆయనే సర్పంచ్‌గిరి చెలాయించాడని కొందరు. సర్పంచులు బిల్లులు రాక బాధలో ఉన్నరు.. రేషన్ కార్డు సర్పంచ్ ఎలా ఇప్పిస్తాడు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. కా ఏది ఏమైనా నాయకుడి కోసం జనం రావడం, ఆయన సర్పంచ్ గిరీ అయిపోయిందని ఏడవడం మాత్రం గొప్ప విషయమే.