Telangana Municipal Election Results: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టిడిపి అనేక పర్యాయాలు అధికారాన్ని దక్కించుకుంది. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు టిడిపి తరఫున ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ వంతుగా తోడ్పాటు అందించారు.
2014లో తెలంగాణ ఏర్పడినప్పటికీ.. ఈ రాష్ట్రంలో టిడిపి చెప్పుకోదగ్గ స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలను గెలిచింది. ఎంపీ స్థానాలను కూడా సొంతం చేసుకుంది.
2018 లో జరిగిన ఎన్నికల్లో కూడా టిడిపి తెలంగాణ రాష్ట్రంలో రెండు స్థానాలను సొంతం చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో ఆ రెండు స్థానాలు కూడా ఆంధ్రకు దగ్గరగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రావడం గమనార్హం.
2014లో టిడిపి ఎమ్మెల్యేలను గులాబీ పార్టీ తన గూటికి చేర్చుకుంది. 2018 లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకుంది. ఈ క్రమంలో టిడిపి తన బలాన్ని కోల్పోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా పార్టీ ఆంధ్రకు మాత్రమే పరిమితమైపోయింది.
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకప్పుడు టిడిపిలో పనిచేశారు. కొడంగల్ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత టిడిపి తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. గులాబీ పార్టీ కూడా ఇదే స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో టిడిపి బలం పెరుగుతోంది అని చెప్పడానికి శుక్రవారం నాటి మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఉదాహరణగా నిలిచాయి.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం లోని మధిర మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టిడిపి విజయం సాధించింది. ఇక్కడి పదవ వార్డులో హోరాహోరీగా సాగిన కౌంటింగ్ లో టిడిపి అభ్యర్థి బోడెపూడి రేవతి విజయం సాధించారు. దీంతో భట్టికోటలో టిడిపి అభ్యర్థి గెలుపు సాధించడంతో చర్చకు దారితీస్తోంది. అయితే ఇక్కడ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలిచింది. తద్వారా మునిసిపల్ పీఠాన్ని కూడా దక్కించుకుంది. మధిర లో టిడిపికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అందువల్లే ఇక్కడ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.