Kavitha bail petition: కవితకు బెయిలొచ్చేనా..? నేడు ఢిల్లీ హైకోర్టులో కీలక పరిణామం

ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనను అక్రమంగా అరెస్టు చేశారని కవిత మొదటి నుంచి వాదిస్తోంది. ఈ కేసులో అరెస్టు అయి అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన సమాచారం మేరకు తనను ఈ కేసులో ఇరికించారని పేర్కొంటున్నారు.

Written By: Raj Shekar, Updated On : May 24, 2024 12:55 pm

Suspense over BRS Leader Kavitha bail petition

Follow us on

Kavitha bail petition: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్ట్‌ అయి తిహార్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం(మే 24న) విచారణ జరుగనుంది. ఈడీ కేసులో ట్రయల్‌కోర్టు(రౌస్‌ అవెన్యూ కోర్టు) కవిత బెయిల్‌ను తిరస్కరించింది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ బెంచ్‌ మే 24న విచారణ చేపడతామని ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం విచారణ జరుగనుంది.

మొదటి నుంచి ఒకటే వాదన..
ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనను అక్రమంగా అరెస్టు చేశారని కవిత మొదటి నుంచి వాదిస్తోంది. ఈ కేసులో అరెస్టు అయి అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన సమాచారం మేరకు తనను ఈ కేసులో ఇరికించారని పేర్కొంటున్నారు. స్టేట్‌మెంట్లు మినహా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కవిత బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తనపై కేసు పెట్టారని ఆమె వాధిస్తున్నారు. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అన్నింటికీ మించి ఒక మహిళ అయినందున బెయిల్‌తో ఊరటను ఇవ్వాలని అభ్యర్థించారు. ఈడీ చార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో కవిత కస్టడీ అవసరం లేదని ఆమె తరఫు న్యాయవాదులు పేర్కొంటున్నారు.

ఈడీ వాదన ఇలా..
ఇక కవిత అరెస్టుపై ఈడీ వాదన మరోలా ఉంది. ఈ కేసులో కవితే కింగ్‌ పిన్‌ అని ఈడీ చెబుతోంది. లిక్కర్‌ పాలసీని అనుకూలంగా తయారు చేయించేందుకు రూ.100 కోట్లు సౌత్‌ గ్రూపు ద్వారా ఆప్‌కు చెల్లింపులు చేయడంలో కవిత ముఖ్య భూమిక పోసించారని, పైసా పెట్టుబడి లేకుండా ఇండో స్పిరిట్‌లో కవిత 33 శాతం వాటా పొందారని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. కవితకు బెయిల్‌ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, రాజకీయ పలుకుబడి ఉన్న వక్తిగా సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ పేర్కొంటోంది.

ఈ రోజు ఏం జరుగుతుంది..
ఇరువురి వాదనల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం ఏం జరుగుతుంది అన్నది ఆసక్తిగా మారింది. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు కొలిక్కి వస్తాయా? లేకుంటే విచారణ మళ్లీ వాయిదా పడుతుందా? అన్న టెన్షన్‌ గులాబీ నేతల్లో నెలకొంది. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసింది. కవిత అరెస్ట్‌ అయి 70 రోజులు దాటింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఏడు చార్జిషీల్లు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్‌ వస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.