Summer Heatwave 2023: ఉత్తర తెలంగాణలో కాలు బయటపెట్టలేం..!

రాష్ట్రానికి ఉత్తర దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఇవి వడగాడ్పులుగా మారుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Written By: Raj Shekar, Updated On : మే 16, 2023 1:06 సా.

Summer Heatwave 2023

Follow us on

Summer Heatwave 2023: దేశవ్యాప్తంగా నాలుగు రోజులుగా భానుడు మండిపోతున్నాడు. ముఖ్యంగా తెలులు రాష్ట్రాలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు వేడిగాలులు తోడవడంతో జనం విలవిలలాడుతున్నారు. ఉత్తర తెలంగాణలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 11 జిల్లాల్లో సోమవారం 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎండ వేడిమి అధికంగా ఉంది. దీంతో వడదెబ్బ బారిన పడి ఇద్దరు మృతిచెందారు.

మరో మూడు రోజులు మంటే..
రానున్న మూడు రోజులు(మంగళ, బుధ, గురువారాల్లోనూ) ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత మరింత పెరగడంతో ఉదయం 11 గంటలు దాటితే చాలు ఆరుబయట పనులు చేసేవారు భరించలేకపోతున్నారు. ఇళ్లలో ఉన్నవారు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు వేడిమి కొనసాగుతోంది. ఖమ్మంలో సాధారణం కన్నా 2.9 డిగ్రీల సెల్సియస్‌ పెరిగింది. నల్గొండలో 2.5, మెదక్‌లో 1.3, భద్రాచలంలో 1.3 సెల్సియస్‌ అధికంగా ఉన్నాయి. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువయ్యాయి. ఆదివారం రాత్రి ఖమ్మంలో సాధారణం కన్నా 2.2 డిగ్రీలు అధికంగా 30 డిగ్రీల సెల్సియస్‌.., హనుమకొండలో 2.1 డిగ్రీలు అధికంగా 29.5 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌ నగరంలోనూ 1.9 డిగ్రీలు అధికంగా 28.7 డిగ్రీలు ఉండటం గమనార్హం.

ఉత్తరాది నుంచి వేడి గాలులు..
రాష్ట్రానికి ఉత్తర దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఇవి వడగాడ్పులుగా మారుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌ గ్రామీణం, వరంగల్‌ పట్టణం, జనగామ, మహబూబ్‌ నగర్, నాగర్‌ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

జాగ్రత్తగా ఉండాలి..
మండుతున్న ఎండలు, వడగాడ్పుల ప్రభావం నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలో ఎక్కువ సమయం గడిపేవారు వడదెబ్బ బారినపడే అవకాశం ఉందని పేర్కొంది. వడదెబ్బ తగిలిన వారికి తక్షణమే చికిత్స అందించాలని.. చల్లటి గాలి తగిలే ప్రదేశంలో ఉంచి విశ్రాంతి ఇవ్వాలని సూచించింది. ఉప్పు, పంచదార కలిపిన చల్లటి నీళ్లను తాగించాలని.. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలని పేర్కొంది. ఎండల తీవ్రతను తట్టుకొనేందుకు.. నూలు దుస్తులు ధరించడం, కళ్లజోడు పెట్టుకోవడం, బయటికి వెళ్లినప్పుడు గొడుగుని ఉపయోగించడం, చర్మానికి సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం వంటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని పేర్కొంటున్నారు.