Telangana: సృష్టి రహస్యాలను ఛేదించేందుకు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నింటిని ఛేదించారు. కానీ అనేక రహస్యాలు ఇంకా అంతుచిక్కకుండా ఉన్నాయి. ఇలాంటి వాటి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని కార్యకలాపాలు రహస్యాల పేరుతో జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) కేంద్రంలోని వడ్డెర కాలనీలో చీకటి పడగానే ఇళ్లపై రాళ్ల వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి ప్రజలకు కొన్ని రోజులుగా రాత్రి కంటిమీద కునుకు ఉండడం లేదు. 7 గంటల నుంచి 12 గంటల వరకు రాళ్లు, మట్టి పెళ్లలు పడడంతో కాలనీవాసులు వణికిపోతున్నారు. దీంతో రాత్రంతా కాపలా కాస్తున్నారు. ఈ కాలనీలో ఏ ఇంటి పైకప్పుపై చూసినా రాళ్లే కనిపిస్తున్నాయి. రాళ్ల భయం నుంచి విముక్తి కల్పించాలని చివరకు పోలీసులు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రాళ్లతోపాటు కాలనీకి చెందిన రాపోలు దుర్గయ్య(Durgaiah) ఇంటి ముందు పసుపు, కుంకుమ, ముగ్గులతో కొబ్బరికాయ కొట్టి, దీపం వెలిగించి ఉంది. ఇది చూసి కుటుంబం మొత్తం ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది.
ఏదో శక్తి అని ఆందోళన..
ఈ ఘటనలతో వడ్డెక కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఏదో శక్తి కాలనీని ఆవహించిందని, దెయ్యమో, బూతమో తమను పగబట్టి ఇలా చేస్తుందని వణికిపోతున్నారు. చీకటి పడగానే ఉలిక్కి పడుతున్నారు. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. తమది వడ్డెర కులమని, ఎవరికీ భయపడమని, కానీ, కొన్ని రోజులుగా రాళ్ల వానకు, భయపడుతున్నామని పేర్కొంటున్నారు. అసలు ఏం జరుగుతుంది.. ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారు. టెక్నాలజీ విస్తరిస్తున్న కంప్యూటర్ యుగంలో ఇలాంటి ఘటనలు జరగడం వారిని మరింత భయపెడుతోంది. చాలా మంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
అంతు చిక్కని మిస్టరీ..
అయితే ఈ రాళ్లవాన ఎక్కడి నుంచి వస్తుంది అనేది అంతుచిక్కడం లేదు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా చేయడం వలన ఎవరికి లాభం అనేది అంతుచిక్కడం లేదు. స్థానికులు రాత్రంతా గస్తీ తిరుగుతూ ప్రాణ నష్టం జరుగకుండా చూస్తున్నారు. గస్తీ తిరుగుతున్న సమయంలోనూ రాళ్లు ఇళ్లపై పడడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. దీంతో మిస్టరీని ఛేదించాలని పోలీసులను కోరుతున్నారు.