https://oktelugu.com/

Rakhi festival : రాఖీ కట్టడానికి ఆంక్షలా? ఇంత దౌర్భగ్య వ్యవస్థ ఏంట్రా బాబూ..?

 రాఖీ పౌర్ణమి.. సోదరి సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిర్వహించుకునే వేడుక ఇది. ఈ రోజున అక్కాచెల్లెళ్ళు తమ అన్నాదమ్ములకు రాఖీ కట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా సరే.. అక్కడికి వెళ్లి రాఖీ కట్టి.. దీవెనలు అందిస్తారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 19, 2024 / 07:28 PM IST

    Rakhi Festival

    Follow us on

    Rakhi festival: దేశం యావత్తు మొత్తం సోమవారం రాఖీ పౌర్ణమి సంబరాలలో మునిగి తేలుతుండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంచిర్యాలలోని రామకృష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మాత్రం దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో దాసరి అశ్విక, సహస్ర అనే బాలికలు చదువుతున్నారు. ఈ బాలికలకు జితేంద్ర అనే తమ్ముడు ఉన్నాడు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అశ్విక, సహస్రకు సెలవు ఇవ్వలేదు. దీంతో తోబుట్టువులు ఇంటికి రాకపోవడంతో జితేంద్ర మనసు కకావికలం అయిపోయింది. ఎలాగైనా సరే వారితో రాఖీ కట్టించుకోవాలని భావించాడు. తన తండ్రితో కలిసి రామకృష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలకు వెళ్లాడు. తన సోదరీమణులు ఈ పాఠశాలలో చదువుతున్నారని, వారితో రాఖీ కట్టించుకునేందుకు అనుమతి ఇవ్వాలని జితేంద్ర అక్కడి సిబ్బందిని కోరాడు. దానికి వారు అసలు ఒప్పుకోలేదు. ఎంతసేపు బతిమిలాడినా వారు కరగలేదు. దీంతో జితేంద్ర కన్నీరు మున్నీరయ్యాడు. అక్కడే విలపిస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత తన మదిలో ఒక ఆలోచన మెదలడంతో.. దానిని తన తండ్రితో పంచుకున్నాడు. దానికి అతడు కూడా ఓకే చెప్పడంతో జితేంద్ర రంగంలోకి దిగాడు.

    అశ్విక, సహస్ర ఉంటున్న హాస్టల్ గది కిటికీ దగ్గరికి జితేంద్ర వెళ్ళాడు. తన తండ్రి భుజాల మీదికి ఎక్కి హాస్టల్ గదిలోని కిటికీ సమీపానికి చేరుకున్నాడు. తన చేతిలో ఉన్న రాఖీలను తన ఇద్దరు సోదరీమణులకు ఇచ్చాడు. వారు ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ తమ తమ్ముడికి రాఖీలు కట్టారు. దీవెనలు అందించారు. అతని నోట్లో స్వీట్ పెట్టి.. ఊరడించారు. అయితే ఈ దృశ్యాలను కొంతమంది తమ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో నెటిజన్లు గురుకుల సిబ్బందిపై మండిపడుతున్నారు..” రాఖీ పౌర్ణమి నాడు ఓ సోదరుడికి ఇన్ని కష్టాలు ఏంటి? రాఖీ కట్టించుకోవడానికి కూడా ఇంత ఇబ్బంది పడాలా? గురుకుల సిబ్బంది ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కదా.. గురుకులాలకు ఉండదా? గురుకులాలు ఏమైనా ప్రత్యేకమైన వ్యవస్థలా?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదే సమయంలో జితేంద్ర తన సోదరీమణులతో రాఖీ కట్టించుకునేందుకు పడిన కష్టాన్ని కొనియాడుతున్నారు. నిజమైన రక్షాబంధన్ అంటే ఇదేనని పేర్కొంటున్నారు. అయితే ఈ వీడియోను కొంతమంది ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గురుకులాల కార్యదర్శులకు ట్యాగ్ చేయడం విశేషం. అయితే ఈ వీడియో గురుకులాల ముఖ్య అధికారుల దాకా వెళ్ళిందని తెలుస్తోంది. వారు విచారణ నిర్వహిస్తున్నారని సమాచారం. అయితే గురుకులాలో చదివే విద్యార్థులకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇళ్లకు పంపించే అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది.