Nizamabad Rains : నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం , ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్, పాలమూరు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. డ్రైనేజీ కాలువలు పూడుకుపోవడం, చెరువులను ఆక్రమించడంతో వాన నీరు పోయేదారి లేక లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతోంది. దీంతో ఆ ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
సోమవారం నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో విస్తారంగా వర్షం కురిసింది. ఉదయం చిన్న జల్లులతో ప్రారంభమైన వర్షం ఆ తర్వాత తీవ్ర రూపు దాల్చింది. ఫలితంగా కుండపోతగా వాన కురిసింది. దీంతో వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ఫలితంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాహనాల రాకపోకలకు విపరీతమైన అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ ప్రాంతంలో వరద నీరు ముంచెత్తడంతో.. ఆ ప్రాంతం మీదుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా వరద నీటిలో చిక్కుకుపోయింది. దీంతో బస్సు ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. దీంతో బస్సు డ్రైవర్, కండక్టర్ అప్రమత్తంగా వ్యవహరించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అందులో ఉన్న ప్రయాణికులను కిందికి దించారు. ఆ తర్వాత ఆ బస్సును జాగ్రత్తగా డిపోకు తరలించారు.
నిజామాబాద్ రైల్వే కమాన్ ప్రాంతంలో డ్రైనేజీ కాలువలు పూడుకుపోయాయి. పైగా ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణలు దర్జాగా సాగుతున్నాయి. ఫలితంగా వాన నీరు బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. దీంతో ఆ ప్రాంతం మొత్తం వర్షం కురిస్తే చాలు చిన్నపాటి జలాశయాన్ని తలపిస్తోంది. సోమవారం ఆర్టిసి బస్సు నీట మునిగేందుకు కూడా ఇదే కారణం. ఆర్టీసీ బస్సు నీట మునగడంతో కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట తెగ సర్కులేట్ అవుతోంది. “చిన్నపాటి వర్షాలకే నిజామాబాద్ నగరాన్ని ఇలా వరద ముచ్చెత్తితే.. భారీగా వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటి? అంటే డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. ఆక్రమణలు ఇష్టానుసారంగా పెరిగిపోయాయి. ఇలాంటి వాటిని నిరోధించేందుకు ఏ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. ఇలా అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎలా బతకాలి? ఈ వానకాలం వారు ఎక్కడికైనా వెళ్ళిపోవాలా? సోషల్ మీడియాలో ఆ దృశ్యాన్ని చూస్తుంటే చెరువు లాగా కనిపిస్తోంది.. ఇంకా నయం డ్రైవర్ అప్రమత్తమయ్యాడు, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించాడు. అయినప్పటికీ ప్రయాణికులు హాహా కారాలు చేశారు. ప్రమాదం నుంచి బయటపడ్డామని అనుకున్నారు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసి బస్సు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కారణంగా రైల్వే కమాన్ వద్ద భారీగా చేరిన వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసి బస్సు
స్థానికుల సహాయంతో బస్సులోని ప్రయాణికులను కాపాడిన పోలీసులు. pic.twitter.com/tWh1FN4B4v
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2024