HomeతెలంగాణSrinivas Name persons Get Together : బాప్‌రే ఒకరా.. ఇద్దరా.. మేమంతా శ్రీనివాసులం..! కలిసి...

Srinivas Name persons Get Together : బాప్‌రే ఒకరా.. ఇద్దరా.. మేమంతా శ్రీనివాసులం..! కలిసి చేసిన పని వైరల్

Srinivas Name persons Get Together : వారిది ఒక గ్రామం కాదు.. ఒక మండలం కాదు.. ఒక జిల్లా కాదు.. కానీ వారంతా ఒక వేదికపై కలిశారు. ‘సంకల్పం ఉంటే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు’ అన్నట్లుగా.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 150 మంది ఒక దగ్గర కలుసుకున్నారు. అది కూడా ఓ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో కలుసుకున్నారు. 150 మంది ఒక దగ్గర కలుసుకుంటే అందులో వింత ఏముందని అనుకుంటున్నారా..! ఏదైనా ఫంక్షన్ లేదా ఏదైనా పెళ్లిళ్లనో కలుసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారా..? లేదంటే వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చారనుకుంటున్నారా..? అది కూడా కాదండి. అసలు .. 150 మంది ఎవరు.. ఎక్కడ.. ఎందుకు కలిశారు..? ఒకసారి తెలుసుకుందాం.

అది కరీంనగర్ నగరం నడిబొడ్డున ఉన్న వేంకటేశ్వరుడి సన్నిధానం. విద్యానగర్‌లోని ఆలయం. అక్కడ ఇటీవల ఓ అరుదైన సంఘటన కనిపించింది. ఎక్కడెక్కడి వారో 150 మంది అక్కడికి చేరుకున్నారు. దాంతో ఆ ఆలయంలో మొత్తం హడావుడి కనిపించింది. అదేంటి ఒక్కసారిగా ఇంత మంది ఒక్కసారిగా టెంపుల్‌కి చేరుకోవడంతో అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. వారు వచ్చిన కారణం చెబితే బాప్‌రే ఇదెక్కడి విచిత్రం అన్నట్లుగా ముక్కున వేలేసుకున్నారు. అందులో పార్టీల లీడర్లు, జర్నలిస్టులు, టీచర్లు తదితర వృత్తులవారు ఉండడం గమనార్హం.

కరీంనగర్‌లో కలుసుకున్న ఈ 150 మంది పేరు ఏంటో తెలుసా..! శ్రీనివాస్..!! అవునండీ ఆ 150 మంది పేర్లు కూడా శ్రీనివాసే. అదే ఇక్కడ విచిత్రం. అంతమంది ఒక్కసారిగా శ్రీనివాసులు అక్కడికి చేరడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రీనివాస్ అని ఒకరిని పిలిస్తే ఓ… అని అందరూ పలకడం కనిపించింది. వీరందరినీ ఒక వేదికపైకి చేర్చింది వాట్సాప్. కరీంనగర్‌కు చెందిన వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిది ఈ ఆలోచన. శ్రీనివాసులందరినీ ఒక వేదికపైకి చేర్చాలనుకున్నాడు. అనుకున్న వెంటనే 11 నెలల క్రితం ఓ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాడు. దానికి ‘కరీంనగర్ శ్రీనివాసులు’ అనే పేరు పెట్టాడు. గతేడాది అక్టోబర్ 10న ఈ గ్రూపు పురుడుపోసుకుంది.

అలా ఆయనకు తెలిసిన శ్రీనివాసులందరి నెంబర్లు సంపాదించాడు. వారి నుంచి వారి వారి దోస్తుల శ్రీనివాసుల నంబర్లు తీసుకున్నాడు. అలా ఒక్కొక్కరి పేరు గ్రూపులో యాడ్ చేస్తూ పోయాడు. అలా పది, ఇరవై, యాబై, వంద దాటారు. రోజురోజుకూ శ్రీనివాసులు పెరుగుతున్నారు. దాంతో ఒక గ్రూపు ఫుల్ అయింది. ఆ వెంటనే మరో గ్రూపు క్రియేట్ చేశాడు. అలా మొత్తంగా మూడు గ్రూపులు ఏర్పాటు చేశాడు. 11 నెలల కాలంలో మూడు గ్రూపుల్లో కలిపి 2,300 మంది శ్రీనివాసులను చేర్చారు. ఇంకా చేరుతూనే ఉన్నారు. చేర్పిస్తూనే ఉన్నారు. 11 నెలలుగా ఒకసారి అందరు ఒక దగ్గర కలుసుకోవాలని గ్రూపుల్లో చర్చిస్తూనే ఉన్నారు. అయితే.. చాలా మందికి వీలు కాకపోవడంతో అది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం దానికి ముహూర్తం రానే వచ్చింది. ఈసారి కలుసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. అందులో బాటులో ఉన్న వారు తప్పనిసరిగా రావాలని అనుకున్నారు. దాంతో 2300 మందిలో నుంచి కేవలం 150 మాత్రమే మొదటిసారి కలుసుకున్నారు.

ఈ సందర్భంగా అందరూ ముందుగా వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీనివాసుల తరఫున మరిన్ని మంచి పనులు చేసేందుకు నిర్ణయించారు. ఆ వెంటనే భేటీ అయ్యారు. పలు తీర్మానాలు చేశారు. ముందుగా శ్రీనివాసుల గ్రూప్‌‌ని శ్రీనివాసుల సేవా సంస్థ (ట్రస్ట్)గా రిజిస్ట్రేషన్ చేయించాలని తీర్మానించారు. అలాగే.. తలసేమియా బాధిత పిల్లల కోసం ‘మన శ్రీనివాస’ బ్లడ్ డోనర్స్ గ్రూప్ ద్వారా సంవత్సరంలో మూడు బ్లడ్ డోనర్స్ క్యాంపులను ఏర్పాటు చేయాలనుకున్నారు. ప్రతి సంవత్సరంలో అందరు కలిసి ఒకసారి తిరుపతి శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళాలని నిర్ణయించారు. ప్రతినెలలో మిత్రులు నిర్ణయించిన శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టాలనుకున్నారు. గ్రూపులోని మిత్రుల కుటుంబాలలో పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భంగా అనాథ పిల్లలకు, వృద్ధులకు పండ్లు, భోజనం పంపిణీ చేయాలనుకున్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు సహాయం అందించడంతోపాటు పలు తీర్మానాలు చేశారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 27 ఆదివారం రోజున తలసేమియా బాధిత పిల్లల కోసం శ్రీనివాస మిత్రుల రైలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబోతున్నారు.

ఈ భేటీ అనంతరం శ్రీనివాసుల గ్రూపు అడ్మిన్ అయిన వూట్కూరి శ్రీనివాస్ మాట్లాడారు. సమస్త శ్రీనివాసులను ఏకతాటిమీదకు తీసుకొచ్చి ఒక ప్రభంజనం సృష్టించాలని ఆ శ్రీనివాసుడి కోరిక అని చెప్పుకొచ్చారు. కరీంనగర్ శ్రీనివాసుల వాట్సాప్ గ్రూపు వేంకటేశ్వరుడి ఆశీర్వాదంతో ప్రారంభమైందని తెలిపారు. ఆ దేవుడి ఆశీస్సులతో సేవా కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. అలాగే.. ఏటా ఒకసారి తిరుపతికి వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. తిరుమలకు వెళ్లే రైలునిండా శ్రీనివాసులే ఉండాలనేదే తమ లక్ష్యం అని చెప్పారు. ఇప్పటికీ గ్రూపుల్లో ఇంకా యాడ్ అవుతూనే ఉన్నారని, సమస్త శ్రీనివాసులందరినీ గ్రూపులోకి తీసుకొస్తామని అన్నారు.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular