Sri Rama Navami 2025: ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైన సీతారామచంద్రస్వామివారి కల్యాణ వేడుకలు మాంగల్య ధారణతో పూర్తయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. సతీమణితో కలిసి తెలంగాణ ప్రభుత్వం తరఫున సీతారామచంద్రస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి, మిగతా ఉన్నతాధికారులు, కల్యాణ క్రతువుకు హాజరయ్యారు. అర్చకులు నిర్వహించిన వివాహ తంతును అద్యంతం ఆసక్తిగా తిలకించారు. వేలాదిమందిగా భక్తులు తరలిరావడంతో భద్రాచలం కాస్త భక్తజన సంద్రంగా మారిపోయింది. భక్తులు కిక్కిరిసిపోవడంతో సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి దాదాపు 5 గంటల దాకా సమయం పట్టింది. కళ్యాణ క్రతవు నేపథ్యంలో మిథిలా స్టేడియం కిటకిటలాడింది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు.. పిడుగులు కూడా పడతాయ్.. వాతావరణ శాఖ అలర్ట్!
ఆ సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి
2016 ఏప్రిల్ 15న అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు భద్రాచలం వచ్చారు. సీతారామ చంద్ర స్వామి కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సతి సమేతంగా సమర్పించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి దంపతులతో పాటు కోడలు, మనుమడు వచ్చారు. ఇక ఆ తర్వాత కేసీఆర్ ఇంకెప్పుడూ సీతారామచంద్రస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించలేదు. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి సతీమణి, ఆమె కోడలు, మనవడు మాత్రమే స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కెసిఆర్ భద్రాచలం రాకపోవడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఈ అంశంపై పదేపదే కేసీఆర్ ను టార్గెట్ చేశాయి. అప్పటి దేవాదా శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పలు సందర్భాల్లో సీతారామచంద్రస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

ఇక గత సంవత్సరం ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సీతారామచంద్రస్వామికి సమర్పించారు. ఇక 2017 జూన్ 26న నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఐ టి సి పి ఎస్ పి డి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో టిఎన్టియూసి మిత్రపక్షాల తరఫున ప్రచారానికి వచ్చారు. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 14న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హోదాలో భద్రాచలం వచ్చారు. జోడో యాత్రలో భాగంగా ఆయన భద్రాచలం వచ్చి సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2024 మార్చి 11న తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలానికి రేవంత్ రెడ్డి వచ్చారు. సీతారామచంద్రస్వామి కళ్యాణం నేపథ్యంలో ఆదివారం భద్రాచలానికి రేవంత్ రెడ్డి సతీసమేతంగా వచ్చారు. ప్రభుత్వం తరఫున సీతారామచంద్రస్వామికి సతీసమేతంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.