Telangana Elections 2023: ఎములాడ రాజన్న దీవెనలు ఎవరికో.. నాన్‌ లోకల్స్‌తో నష్టమే అంటున్న ఓటర్లు!

వేములవాడలో కంటే జర్మనీలోనే ఎక్కువకాలం గడపడం నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకంగా మారింది. స్థానికంగా ఉండకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి.

Written By: Raj Shekar, Updated On : November 25, 2023 9:11 am

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణలో కీలక నియోజకవర్గం వేములవాడ. ఒకప్పుడు జనశక్తికి అడ్డాగా ఉన్న వేములవాడ.. కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉంది. చెన్నమనేని రాజేశ్వర్‌రావు కమ్యూనిస్టుగానే ఇక్కడి నుంచి విజయం సాధించారు. తర్వాత టీడీపీ, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. రాజేశ్వర్‌రావు ఉన్నంత వరకు స్థానికులకు ఒక భరోసా ఉండేది. తండ్రి వారసత్వాని‍్న అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనయుడు చెన‍్నమనేని రామేశ్‌బాబును నియోజకవర్గ ఓటర్లు వరుసగా మూడుసార్లు గెలిపించారు. కానీ, ఆయన వేములవాడలో కంటే జర్మనీలోనే ఎక్కువకాలం గడపడం నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకంగా మారింది. స్థానికంగా ఉండకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి.

మళ్లీ స్థానికుతరుడే..
చెన్నమనేని రమేశ్‌బాబుకు వెలమ సామాజికవర్గం నేత కావడంతో కేసీఆర్‌ 2014, 2018లో ఆయనకే టికెట్‌ ఇచ్చారు. ఓటర్లు కూడా రమేశ్‌బాబును గెలిపించారు. రమేశ్‌బాబుకే భారతీయ పౌరసత్వంపై వివాదం కొనసాగుతుండడం, స్థానికేతరుడని కోర్టు తీర్పు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉండడంతో గులాబీ బాస్‌ ఈసారి అలర్ట్‌ అయా‍్యరు. ఈసారి కూడా తన సామాజికవర్గానికే చెందిన నేతకు టికెట్‌ ఇచ్చారు. ఏడాది క్రితం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన చెల్మెడ రాజేశ్వర్‌రావుకు ఈసారి టికెట్‌ దక్కింది. అయితే, చెన్నమనేని కూడా స్థానికుతరుడే అన్న అభిప్రాయం స్థానికుల్లో ఉంది. రాజేశ్వర్‌రావు పూర్వీకులది కోనారావుపేట మండలం. దీంతో తాను స్థానికుడినే అని చెప్పుకుంటున్నారు రాజేశ‍్వర్‌రావు. కానీ, రాజేశ్వర్‌రావు ఎన్నికల్లో పోటీ చేసేందుకే నియోజవర్గంలో ఉంటున్నారు. ఎన్నికల వేళనే కనిపిస్తాడన్న అపవాదు కూడా రాజేశ్వర్‌రావుకు ఉంది. అందుకే కరీంనగర్‌లో కాంగ్రెస్‌ టికెట్‌పై మూడుసార్లు పోటీ చేసినా ఓడిపోయారు. ఈసారి వేములవాడ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

స్థానికేతరమే సంకటం..
చల్మెడ రాజేశ్వర్‌రావు వివాద రహితుడు, మెడికల్‌ కళాశాల ద్వారా లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అయితే రాజకీయాల్లో క్యాడర్‌ను పటి‍్టంచుకోరన్న అపవాదు ఉంది. ఇక వేములవాడలో ఇప్పటికే చెన్నమనేని రమేశ్‌బాబును ఎన్నుకుని తప్ప చేశామన్న భావనలో ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో రాజేశ్వర్‌రావుకు కూడా స్థానికేతరమే సంకటంగా మారబోతుందంటున్నారు విశే‍్లషకులు. ‘చెన్నమనేనీ గెలిపిస్తే.. జర్మనీ లో ఉన్నడు.. చల్మెడ గెలిస్తే కరీంనగర్‌లో ఉంటడు’ అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

‘ఆది’పై పెరుగుతున్న సానుభూతి
వేములవాడలో ఒక్కసారి అయినా గెలిచి.. శాసన సభలో అధ్యక్షా అనాలని భావిస్తున్నారు స్థానిక నేత ఆది శ్రీనివాస్‌. 2004లో సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఆది శ్రీనివాస్‌ను వేములవాడ ఆలయ కమిటీ చైర్మన్‌గా నియమించారు. 2009లో వేములవాడ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. అప్పటి నుంచి 2014, 2018 ఎన్నికల్లోనూ పోటీచేసి హ్యాట్రిక్‌ ఓటమి మూటగట్టుకున్నారు. ఉప ఎన్నికల్లోనూ ఓటమే ఎదురైంది. ఈ క్రమంలో ఈసారి కూడా కాంగ్రెస్‌ టికెట్‌పై మళ్లీ బరిలో నిలిచారు. ఇన్నాళ్లూ స్థానికేతరుడికి ఓట్లు వేసి పొరపాటు చేశాం.. ఈసారి స్థానికుడిని గెలిపించుకుందామన్న అభిప్రాయం వేములవాడలో మేజారిటీ ఓటర్లలో వ్యక్తమవుతోంది. దీంతో ఇతర పార్టీలు ఓటుకు రూ.10,000 ఇచ్చింది ఒకటి.. ఆది శ్రీనివాస్ ఒక దండం పెట్టింది ఒకటి.. అన్న విధంగా విపరీతమైన సానుభూతి పెరుగుతోంది.

రాష్ట్రమంతటా కాంగ్రెస్‌ హవా, మరోవైపు వేములవాడలో ఆది శ్రీనివాస్‌పై సానుభూతి పెరుగుతుండడం రెండు కలిసి ఈసారి ఆది శ్రీనివాస్‌ గెలుపు అవకాశాలు చాలా మెరుగయ్యాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలోనూ ఈ విషయం నిర్ధారణ అయినట్లు సమాచారం.