Telangana BJP: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి రెండు అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఏకపక్షంగా సాగినప్పటికీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అధికార బీఆర్‌ఎస్‌తోపాటు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మూడు పార్టీలూ తమదే అధికారం అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లాయి. అయితే ఈ రేసులో చివరికి కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్‌ఎస్, బీజేపీ రెండు, మూడో స్థానానికి పరిమితమయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కీలకంగా మారింది. అధికార బీఆర్‌ఎస్‌ను గద్దె దించడంలో కీలకపాత్ర పోషించిందనడం కాదనలేని వాస్తవం. 2014, 2018 ఎన్నికలతో పోలిస్తే బాగా పుంజుకున్న కమలం పార్టీ.. 2023లో అధికారంలోకి వస్తుందా అనిపించింది. కానీ, స్వయంకృతాపరాధం.. ఆ పార్టీని మూడోస్థానానికి పరిమితం చేసింది. కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. బీజేపీ పరిస్థితి ఎగిసి పడిన కెరటంలా మారింది. దాదాపు ఏడాదిన్నరగా బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించిన పార్టీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత పూర్తిగా మారిపోయింది. కెరటం వెనక్కు వెళ్లిపోయినట్లుగా.. బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోయింది.
క్షేత్రస్థాయికి బీజేపీ..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో ఆ పార్టీ గ్రామీణ స్థాయిలోకి బలంగా వెళ్లింది. బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అంతేగాక, 2002, ఆగస్టు 29న ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ఐదు విడతల యాత్రతో రాష్ట్రంలో పార్టీకి గతంలో కనీ వినీ ఎరుగని హైప్ వచ్చింది. ప్రజలంతా బీఆర్‌ఎస్‌ను గద్దె దించేది బీజేపీ మాత్రమే అని అనుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు బీజేపీవైపు చూశారు. సంజయ్ పాదయాత్రలో ప్రజల సమస్యలు వింటూ వారికి భరోసానిచ్చారు. మరోవైపు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికార బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వనుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు.
జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ ఎప ఎన్నికల ఫలితాలతో ఊపు..
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, జరిగిన ఉపఎన్నికల్లోనూ బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. ఈ క్రమంలోనే పలువురు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ నేతులు కూడా బీజేపీలో చేరడం ఆ పార్టీకి మరింత బలం చేకూరింది. దీనికి బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్రం మరింత ఊపు తెచ్చింది. ఈ క్రమంలో అనేక మంది నాయకులు బీజేపీలో చేరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు.. బండి సంజయ్ పదవీకాలం ముగిసింది. అయితే అధిష్టానం అధ్యక్షుడిని మార్చొద్దని మొదట నిర్ణయిచింది.
వలస నేతల ఒత్తిడితో..
కానీ వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు ఎన్నికల వేళ.. అధ్యక్షుడి మార్పు కోసం పట్టుపట్టారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అధ్యక్షుడిని మార్చకుంటే.. తామే మారిపోతామని అల్టిమేటం ఇచ్చారు. ఇలాంటి వలస నేతలకు సొంత పార్టీ నేతలు కూడా జత కలిశారు. దీంతో ఎన్నికల వేళ.. పార్టీని వీడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన అధిష్టానం సంజయ్‌ను తప్పించింది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డిని మరోసారి పార్టీ అధ్యక్షుడిగా చేసింది అధిష్టానం. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర బీజేపీలో అయోమయ పరిస్థితి నెలకొంది. పార్టీ కార్యక్రమాలు క్రమంగా డీలాపడుతూ వచ్చాయి.
కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్..
ఈ క్రమంలోనే కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినట్లయింది. ఓ వైపు బీజేపీ వెనకపడినట్లు కనిపించడంతో కాంగ్రెస్ పార్టీ తన జోరును పెంచింది. కర్ణాటక కాంగ్రెస్ నేతలతోపాటు జాతీయ నేతలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రామస్థాయిలో విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణులను మేలుకొలిపింది. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా ప్రస్తుతం బీజేపీ లేదని డిసైడ్ అయిన ప్రజలు.. కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని భావించారు.
బీజేపీ–బీఆర్‌ఎస్ రహస్య మైత్రి..
ఇక తెలంగాణలో అధికార పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్కటయ్యాయన్న వాదనను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవడం, కేసీఆర్ అవినీతి పాలన చేస్తున్నాడని కేంద్ర మంత్రులు, స్వయంగా ప్రధాన మంత్రి ఆరోపించడం మినహా అవినీతి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బీజేపీ–బీఆర్‌ఎస్ ఒక్కటే అన్న భావనను ప్రజల్లో కల్పించాయి.
అగ్రనేతలు వచ్చినా..
ఎన్నికలకు నెల రోజులు గడువుందనగా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీ అగ్రనతేలు తెలంగాణలో పర్యటించి మరోసారి బీజేపీని బలంగా మార్చే ప్రయత్నం చేశారు. బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ, పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటన చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఆ పార్టీకి అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రాలేదు. బీజేపీ అగ్రనేతలు చేసిన కీలక ప్రకటనలు కూడా బీజేపీని రెండోస్థానంలో కూడా నిలుపలేకపోయాయి.
అధికార బీఆర్‌ఎస్ పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను, రాష్ట్ర బీజేపీ నాయకత్వ లోపాలను తమకు అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంచుకుని తెలంగాణలో అధికారానికి కావాల్సిన అసెంబ్లీ స్థానాల్లో గెలుపు నమోదు చేసి సంచలనం సృష్టించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పడిలేచిన కెరటంగా మారితే.. బీజేపీ మాత్రం లేచిపడిన కెరటంగా మారింది. ఇదంతా బీజేపీ స్వయంకృతాపరాధమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే భవిష్యత్‌పై మాత్రం ఆశలు ఉన్నాయంటున్నారు కమలం నేతలు. లోక్‌సభ ఎన్నికల్లో, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెబుతున్నారు.