Telangana Elections 2023: తెలంగాణలో కీలక నియోజకవర్గాలో హుస్నాబాద్ ఒకటి. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక నేతల్లో ఒకరైన కెప్టెన్ లక్ష్మీకాంతరావు సొంత నియోజకవర్గం హుస్నాబాద్. తెలంగాణ వచ్చిన తర్వాత 2014, 2018లో ఆయన తనయుడు ఒడితెల సతీశ్‌కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా ఒడితెలకు గుర్తింపు ఉంది. అయితే అభివృద్ధి విషయంలోనూ ఒడితెల హుస్నాబాద్‌కు ఎలాంటి ప్రయోజనం చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈసారి హుస్నాబాద్ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని తెలుస్తోంది.
కేసీఆర్ తొలి సభ ఇక్కడే..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రతీసారి హుస్నాబాద్ నుంచే మొదలు పెడతారు. 2014, 2018లో ఇక్కడే ఎన్నికల సభ నిర్వహించారు. 2023లో కూడా ఆయన ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 70కి పైగా సభలు నిర్వహించారు. అయితే గత రెండు ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ సెంటిమెంట్ బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుందని, తనను కూడా గెలిపిస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి ఒడితెల సతీశ్ భావిస్తున్నారు.
‘పొన్నం’ రాకతో..
అనేక తర్జనభర్జనల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఈ సీటును సీపీఐకి కేటాయిస్తుందని ప్రచారం జరిగింది. కానీ మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమకారుడు, గౌడ సామాజికవర్గానికి చెందిన నేత పొన్నం ప్రభాకర్ ఈ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతకు ముందే హుస్నాబాద్‌లో పర్యటిస్తూ స్థానికులతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా అక్కడి నేత అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని కాదని, పొన్నంకు టికెట్ ఇచ్చింది. దీంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. మూడు లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న హుస్నాబాద్‌లో 70 వేల మంది గౌడ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. పొన్నం కూడా గౌడ సామాజికవర్గానికి చెందినవారే కావడంతో ఈసారి ఇందులో కనీసం 50 వేల ఓట్లు కాంగ్రెస్‌కు పోలవుతాయని తెలుస్తోంది.
మారని హుప్నాబాద్ రూపురేఖలు..
ఒడితెల సతీశ్‌పై ఎలాంటి అవినీతి, అక్రమాల ఆరోపణలు లేకపోయినా.. పదేళ్లలో హుస్నాబాద్‌ను ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న అపవాదు ఉంది. స్థానికంగా ఉండరనే, సమస్యల పరిష్కారానికి వెళితే కలవరని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి పొన్నం ప్రభాకర్‌ను గెలిపించాలని గులాబీ నేతలు సైతం కోరుకుంటున్నారని సమాచారం. దీంతో ఈసారి హుస్నాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎకరడం కాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.