Zomato: “అడుసు తొక్కొద్దు. కాలు కడగొద్దు”. కానీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో కు ఇది ప్రతిసారీ పరిపాటి గానే మారింది. వివాదాస్పదమైన ప్రకటనలు రూపొందించడం, ఆ తర్వాత జనాగ్రహానికి గురి కావటం, క్షమాపణలు చెప్పటం ఆ సంస్థకు అలవాటే. గతంలో హలాల్ వంటకాలు మాత్రమే వంటకాలు మా దగ్గర లభిస్తాయని చెప్పి ఒక ప్రకటన చేసి అభాసు పాలైంది. ” బ్యాన్ జొమాటో” పేరుతో సోషల్ మీడియాలో ఉద్యమం జరగడంతో సారి అని చెప్పి లేంపలేసుకుంది. ఆమధ్య హైదరాబాదులో జొమాటో వాట్సాప్ గ్రూప్ లో సిరాజ్ అన్న యువకుడు భారత జాతీయ జెండాను తగలబెడుతున్న వీడియోను పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఆ గ్రూపులో సభ్యుడైన తిరుమల్ రెడ్డి అనే వ్యక్తి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదాస్పదమైంది. హిందూ సంఘాలు ఆందోళన చేయడంతో సిరాజ్ అనే యువకుడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా జొమాటో తన తీరు మార్చుకోవడం లేదు.

..
ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రసాదం పై వివాదాస్పద ప్రకటన
..
ఉజ్జయిని మహంకాళి.. భారతదేశంలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రముఖమైన ఆలయం. ఇది మధ్యప్రదేశ్ లో ఉంటుంది. ఈ ఆలయంలో తాలీ పేరుతో భక్తులకు ఉచితంగా ప్రసాదం అందజేస్తారు. అక్కడి ఉజ్జయిని కలెక్టర్ ఆశిష్ సింగ్ ఆ దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. కేవలం ఉజ్జయిని మాత్రమే కాకుండా దేశంలోని అన్ని శక్తిపీఠాల్లో అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. భక్తులు కూడా ఆ ప్రసాదాన్ని భగవంతుడి వరప్రసాదంగా భావిస్తూ ఉంటారు. ఇంతటి చారిత్రక నేపథ్యాన్ని గుర్తించకుండా జొమాటో అనే సంస్థ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో ఒక వాణిజ్య ప్రకటన రూపొందించింది. అదే ఆ సంస్థను చిక్కుల్లో పడేసింది.
..
ఇంతకీ ఏమిటి ఆ ప్రకటన
..
తాలీ అంటే తెలుసు కదా! ఒక ప్లేటు భోజనం. హోటళ్ళ ల్లో సౌత్ ఇండియన్ తాలీ, నార్త్ ఇండియన్ తాలీ అని మోనూ ఉంటుంది. ఫిక్స్ డ్ ఐటమ్స్ తో సప్లై చేస్తారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రసాదాన్ని కూడా తాలీ అనే అంటారు. అది ఉచిత అన్నదానం కూడా. అయితే హృతిక్ రోషన్ పై రూపొందించిన యాడ్లో “ప్రసాదం తినాలని ఉంది గుడికి ఆర్డర్ ఇచ్చాను” అని ధ్వనించేలా ఉంది. ఇది అనువాదం వల్ల అలా జరిగిందా? లేక జొమాటో యాడ్ క్రియేట్ టీం కావాలనే తమ వ్యాపార అభివృద్ధి కోసం చేశారా అనేది తేలాల్సి ఉంది. ఈ విషయం ఉజ్జయిని మహంకాళి ఆలయ పూజారులకు తెలవడంతో వారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వెంటనే ట్విట్టర్లో బ్యాన్ జొమాటో అంటూ ట్రెండింగ్ కు తెర తీశారు. పనిలో పనిగా ఉజ్జయిని కలెక్టర్ ఆశిష్ సింగ్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఈలోపు ఈ విషయం మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తం మిశ్రాకు తెలిసింది. వెంటనే ఆయన దీని పూర్వపరాలు పరిశీలించి తనకు నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇలాంటి విషయాల్లో నరోత్తం మిశ్రా చాలా దూకుడుగా ఉంటారు. దెబ్బకు తేరుకున్న జొమాటో “అబ్బబ్బే అలాంటిది ఏమీ లేదు. మేము ఎవరి మనోభావాలనూ కించపరచలేదు. యాడ్ లో హృతిక్ రోషన్ అంటున్నది మహా కాల్ రెస్టారెంట్ నుంచి తాలీ తెప్పించుకుని తిన్నాను అని. అది మహంకాళి గుడి నుంచి కాదు” అని సంజాయిషి ఇచ్చుకుంది. “మేము పాన్ ఇండియా వాణిజ్య ప్రకటనలు చేస్తుంటాం. ఇందులో భాగంగా ఆయా చారిత్రక ప్రాంతాల పేర్లను వాడుకుంటామని” కవరింగ్ ఇచ్చింది. చివరగా మేము హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే క్షమించండి అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇకపై ఆ వాణిజ్య ప్రకటనను ప్రసారం చేయబోమని తేల్చి చెప్పేసింది. అయితే జొమాటోకు ఇది కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేసింది. ఆ యాడ్స్ రూపొందించే క్రియేటివ్ టీమ్ కు తెలివి లేక కాదు. తెలివి ఎక్కువ ఇలాంటి దిక్కుమాలిన ప్రకటనలు రూపొందిస్తున్నారు. పైగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రకటనల్లో ఆ వర్గానికి చెందిన నటీనటులు నటించడం, డబ్బులకు ఆశపడి ఎలా రూపొందిస్తున్నారో తెలుసుకోకుండా నటించడం మరింత దారుణం.