Amit Shah NTR : ఊరికే రారు మహానుభావులు అని.. ఏదైనా రాజకీయ ప్రయోజనం లేనిది ఎవ్వరూ ఎవరిని కలవరు. ముఖ్యంగా దేశంలోనే పవర్ ఫుల్ పెద్దమనిషి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు అర్థం పరమార్థం ఉంటుంది. తాజాగా మునుగోడు సభకు వచ్చిన తర్వాత అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లోనే మీడియా మొఘల్ అనదగ్గ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కలిశారు. తెలంగాణలో బీజేపీకి ఉన్న పరిస్థితులు.. గెలుపు కోసం వ్యూహాలు తెలుసుకున్నారు. అనంతరం రాత్రి హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు. ఏకాంత చర్చలు జరిపారు. కనీసం బండి సంజయ్ ను కూడా ఈ మీటింగ్ లో పాల్గొననీయలేదు.

ఆర్ఆర్ఆర్ లో కొమురంభీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయి ఆయనను అభినందించాలని అమిత్ షా భావించారని.. అందుకే భేటి అయ్యారని బీజేపీ ఓ ప్రకటన చేసింది. అందుకే డిన్నర్ భేటికి పిలిచారని తెలిపింది. అయితే ఇక్కడే ఏదో ఒకటి తేడా కొడుతోంది.
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర కంటే మొత్తం చిత్రం అల్లూరి సీతారామరాజు చుట్టే తిరుగుతుంది. ఈ పాత్ర పోషించిన రాంచరణ్ మెయిన్ రోల్ పోషించారు. అమిత్ షా కలవాలనుకుంటే ఎన్టీఆర్ కంటే ముందే రాంచరణ్ ను కూడా పిలవాలి. కానీ అది సాధ్యం కాలేదంటే ఇందులో రాజకీయం ఇమిడి ఉన్నట్టే లెక్క. నిజంగా ఆర్ఆర్ఆర్ మూవీ నచ్చితే.. రాంచరణ్ ను కూడా పిలిచేవాడే. పైగా అల్లూరి ఏపీ స్వాతంత్ర్య సమరయోధుడు. ఇటీవల ప్రధాని సైతం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి వారి కుటుంబ సభ్యులను కలిసి అల్లూరి చరిత్రపై గొప్పగా మాట్లాడారు. భారత స్వాతంత్ర్య సమరయోధుల్లో ఏపీ నుంచి అల్లూరికి మొదటి స్థానం దక్కుతుందని మోడీ కితాబిచ్చారు. అలాంటి అల్లూరి పాత్ర పోషించిన రాంచరణ్ ను పిలవకుండా కేవలం ఎన్టీఆర్ తోనే అమిత్ షా భేటి కావడం సినిమా పరంగా కాదని.. దీని వెనుక రాజకీయం ఉందని ఈజీగా అర్థమవుతోంది.
నిజంగా సినిమాల పరంగా అభినందించాల్సి వస్తే.. ఉత్తర భారతదేశంతోపాటు తెలుగు నాట కూడా ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ నటనకు మంచి పేరు వచ్చింది. నిజంగా కలవాల్సి వస్తే మొదట ఈ భేటికి రాంచరణ్ ను.. ఈ సినిమా తీసిన రాజమౌళిని కూడా డిన్నర్ భేటికి పిలిచేవారే.. కానీ ఎన్టీఆర్ ఒక్కరినే పిలవడంతో ఇది సినిమాల పరంగా కలిసిన భేటి కాదని అర్థమవుతోంది.
అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి రాంచరణ్ ను కలవకపోవడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ బీజేపీకి దూరంగా దాగుడుమూతల గేమ్ ఆడుతోంది. పవన్ సైతం బీజేపీతో అంటకాగకుండా ఏపీలో సొంతంగా ముదుకెళుతున్నారు. కౌలు రైతు భరోసా యాత్ర, జనవాణి పేరిట ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ రెండింటి వల్ల పవన్ కళ్యాణ్ కు మంచి పేరు వస్తోంది. జనసేనకు జనాల్లో క్రేజ్ వస్తోంది.
పైకి పొత్తులు పెట్టుకొని వెళుతున్నామని బీజేపీ-జనసేన అంటున్నా వారి ప్రజా పోరాటాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ ను ఉమ్మడి సీఎం క్యాండిడేట్ గా గుర్తించడానికి అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీ జీవీఎల్ లు కూడా ఒప్పకోలేదు. పైగా జనసేనతో పొత్తును లైట్ తీసుకున్నారు. దీంతో అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ బీజేపీ నీడ నుంచి బయటకు వచ్చి సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. సమీకరణాలు అనుకూలిస్తే అవసరమైతే టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఇదే సమయంలో బీజేపీ కేంద్రంలో వైసీపీతో స్నేహంగా ఉంటూ రాష్ట్రంలోనూ జగన్ కు వ్యతిరేకంగా వెళ్లడం లేదు. ఇటు చంద్రబాబును నమ్మి దగ్గరకు తీయడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీ స్ట్రాటజీ నచ్చక సొంతంగా ముందుకెళుతున్నారు.
బీజేపీకి దూరంగా జరుగుతున్న పవన్ కళ్యాణ్ ను, మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీని బీజేపీ చేరదీస్తున్నట్టు తెలిసింది. అందుకే మెగా ఫ్యామిలీకి చెందిన రాంచరణ్ ను అమిత్ షా ఆహ్వానించలేదని తెలుస్తోంది. బీజేపీని కాదని పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం దృష్ట్యానే రాంచరణ్ ను కూడా ఈ భేటికి పిలవలేదని.. దీనివెనుక రాజకీయమే ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు ప్రత్యామ్మాయ నేతను తయారు చేయడం కోసమే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటి అయ్యారని.. జూనియర్ ఒప్పుకుంటే పైకి తీసుకురావాలని ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కానీ జూనియర్ మాత్రం ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేనట్టుగా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ తో ఉన్న గ్యాప్ ను పూడ్చుకోవాల్సింది పోయి.. బీజేపీ ఇలా ఆయనను దూరం పెట్టి ఇతర వర్గాలను చేరదీసే నయా రాజకీయం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. మెగా ఫ్యామిలీ కంటే బలమైన నందమూరి ఫ్యామిలీని ఆకర్షించే ఎత్తుగడ వేసింది. ఇది ఎంతవరకు ఫలిస్తుందన్నది వేచిచూడాలి.