HomeతెలంగాణSons Neglect Mother: కన్నతల్లి కన్నీటి పాఠం – మరచిన మానవత్వం

Sons Neglect Mother: కన్నతల్లి కన్నీటి పాఠం – మరచిన మానవత్వం

Sons Neglect Mother: కన్నతల్లి కంట నీరు రానివ్వకు. కన్న తండ్రి మనసు నొప్పించకు. అయినవాళ్లను దూరం చేసుకోకు. చిన్నప్పుడు పాఠ్యపుస్తకంలో చదువుకున్న పాఠం ఇది. బహుశా ఆ వయసులో ఈ పాఠానికి అర్థం తెలియకపోయినా.. ఆ పాఠం గురించి ఉపాధ్యాయుడు చెప్పినా అర్థం కాకపోయినా.. భవిష్యత్తులోనైనా ఆ పాఠానికి అర్థం తెలుసుకుంటారని.. పాఠంలో ఉన్న పదాలకు తగ్గట్టుగా జీవితాన్ని మలచుకుంటారని.. వెనుకటి కాలంలో పుస్తకాలలో ఆ తరహా జీవిత సత్యాలను పాఠాలుగా రూపొందించేవారు. ఇటువంటి సంఘటన చూసిన తర్వాత కచ్చితంగా అటువంటి పాఠాలను నేటి కాలం యువతకు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పడం మాత్రమే కాదు ఆచరణలో చూపించాల్సిన అవసరం కూడా ఉంది.

తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతి పేటలో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లికి తిండి పెట్టకుండా నలుగురు కొడుకులు ఆమెను రైతు వేదికలో వదిలేశారు.. తేలికపాటి దుప్పటి మాత్రమే ఆమె కప్పుకుంది. చలికి వణికి పోతూ ఆమె నరకం చూసింది. ఆమె దుస్థితి చూసిన అధికారులు కొడుకుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నతల్లికి కడుపునిండా అన్నం పెట్టకుండా ఇలా వదిలేయడం ఏంటని మండిపడ్డారు. మరోవైపు స్థానికులు ఆమె విషయంలో చొరవ చూపించారు. కొంతమంది తమ ఇంటికి తీసుకెళ్లి అన్నం పెట్టారు. ఆశ్రయం కల్పించారు. ఆ వృద్ధురాలి దీనస్థితి పట్ల అధికారులు చలించిపోయారు.

Also Read: YSR Jayanthi: నాన్న.. మళ్లీ రావా.. జగన్ ఏమోషనల్ వీడియో

ఆస్తి విషయంలో జరిగిన గొడవలే దీనికి కారణమని తెలుస్తోంది. మరోవైపు చరమాంకం లో ఉన్న తల్లిని సాకే విషయంలో నలుగురు కుమారులు వంతులు వేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కోడళ్ల మధ్య గొడవలు రావడంతో ఆమెను కన్నకొడుకులు ఇలా రైతు వేదికలో వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. తినడానికి తిండి లేక.. తాగడానికి నీరు లేక.. ఉండడానికి చోటు లేక ఆ వృద్ధురాలు తీవ్రంగా ఇబ్బంది పడింది. చలికి వణుకుతూ నరకం చూసింది. అయినప్పటికీ ఆ నలుగురు కుమారులలో చలనం లేకపోవడం విశేషం..

ఈ వ్యవహారం మీడియాకి రావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. స్థానికులు ఆ నలుగురు కుమారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నతల్లి సంపాదించిన ఆస్తి మొత్తం తీసుకొని.. ఇప్పుడు ఆమె కాటికి కాలు చాపిన వయసులో ఉండగా ఇలా వదిలివేయడం ఏంటని మండిపడుతున్నారు. అధికారులు ఆ నలుగురు కుమారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆమె సంపాదించిన ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని.. అప్పుడే వారికి బుద్ధి వస్తుందని పేర్కొంటున్నారు. కన్నతల్లిని పట్టించుకోని వారిని జైల్లో వేయాలని డిమాండ్ చేశారు.. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఆ నలుగురు కుమారులు బయటికి రాలేదు. చివరికి అధికారులు రావడంతో నలుగురు కుమారులు వచ్చారు. తమ తల్లి దీనస్థితి చూసి కూడా వారు చలించలేదు. దీంతో అధికారులు వారు తీరు పట్ల మండిపడుతున్నారు. ఇలాంటి వ్యవహార శైలి సరికాదని హితవు పలుకుతున్నారు. అయితే దీనిపై అధికారులు ఆ నలుగురు కుమారులతో చర్చలు జరుపుతున్నారు.. నలుగురు కుమారులతో సంబంధం లేకుండా ఆ వృద్ధురాలికి చిన్నపాటి రేకుల షెడ్డు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version