
తెలిసీతెలియని ప్రాయం. ఏమైందో అర్థంకాని వయసు. తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిందని తెలియక ఆమె ఫోన్ రింగ్ కావడంతో అమ్మా ఫోనొచ్చింది మాట్లాడమ్మా అంటూ ఆ పసి మనసు అడిగే తీరు చూసి అందరు చలించిపోయారు. కన్నతల్లి ఇక లేదనే విషయం తెలియక మూడేళ్ల కుమారుడు మాట్లాడే మాటలు అక్కడ ఉన్న వారిని కదిలించాయి. మనసులో కన్నీటి సుడులు తిరిగాయి. తల్లి ఇక లేదనే కఠోర నిజం తెలీక ఆ చిన్నారి చేస్తున్న చేష్టలు అందరిలో బాధను కలిగించాయి. హృదాయ విదారకర సంఘటనను చూసి అందరిలో దుఖం కట్టలు తెంచుకుంది. కన్నీటిని ఆపుకోలేక పోయారు.
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన కేతావత్ సోమశేఖర్ కు సూర్యపేట జిల్లా నేరేడుచర్ల మండలానికి చెందిన దివ్య(26)తో అయిదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరు ఎంబీబీఎస్ పూర్తి చేయడంతో వివాహమైన ఏడాది తరువాత సోమశేఖర్ భార్యతో కలిసి ఉన్నత చదువుల కోసం దుబాయి వెళ్లారు రెండు నెలల కిందట దంపతులు ఇద్దరు స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో దివ్యను, మూడేళ్ల కుమారుడు విరాట్ ను తన తల్లిదండ్రుల వద్ద వదిలి సోమశేఖర్ నెల క్రితం దుబాయి వెళ్లిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అత్తామామలు వరండాలో కూర్చుని ఉండగా దివ్య కుమారుడిని బయటకు పంపించి లోపల తాళం వేసుకుంది. తర్వాత చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. బిడ్డ తలుపు తడుతూ ఏడుస్తుండడంతో తేరుకున్న అత్తమామలు, చుట్టుపక్కల వారి సాయంతో బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే దివ్య మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి మృతి చెందిన విషయం తెలియని మూడేళ్ల చిన్నారి ఫోన్ రింగయిందని అమ్మకు ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం అక్కడున్న వారిని కలిచివేసింది. తరలిరాని లోకాలకు వెళ్లిన తల్లితో కుమారుడు మాట్లాడే మాటలు విని అందరు ఖంగుతిన్నారు. అమ్మా అంటూ పెడుతున్న ఆర్తనాదాలు విని కన్నీరుమున్నీరుగా విలపించారు.