HomeతెలంగాణSkill University: తెలంగాణలో స్కిల్‌ యూనివర్సిటీ.. యువతలో నైపుణ్యం పెంపునకు చర్యలు.. యుద్ధ ప్రాతిపదికన...

Skill University: తెలంగాణలో స్కిల్‌ యూనివర్సిటీ.. యువతలో నైపుణ్యం పెంపునకు చర్యలు.. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు!

Skill University: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడం.. నైపుణ్యం మెరుగుపర్చడమే లక్ష్యంగా స్కిల్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి సర్కార్‌ నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది.

ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనే..
ప్రస్తుతం ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రాంగణాల్లోనే ఈ స్కిల్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా అటు ఐటీ కంపెనీలతోపాటు ఇటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉంటుందన్న యోజనలో సర్కార్‌ ఉంది. ఇక స్కిల్‌ యూనివర్సిటీలో ఏయే కోర్సులు అందుబాటులో ఉండా లి. ఎలాంటి పాఠ్యాంశాలు ఉండాలి.. పరిశ్రమల అవసరాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా యువతకు అవకాశాలు దక్కేలా ఏయే కోర్సులు నిర్వహించాలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

జూలై చివరి వారంలో..
జూలై 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈలోపే స్కిల్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమలు, విద్యాశాఖల అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఇందుకు అవసరమైన సహకారం అందించాలని పారిశ్రామిక రంగ ప్రముఖలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రతిపాదనలు వచ్చిన 24 గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈమేరకు గచ్చిబౌలిలో ఇంజినీరింగ్‌ స్టాఫ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు సమావేశమయ్యారు.

ప్రముఖుల అభిప్రాయాలు సేకరణ..
ఈ సమావేశంలో అధికారులు, పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. స్కిల్‌ యూనివర్సిటీల ఏర్పాటుపై అభిప్రాయాలు సేకరించారు. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్‌బీతరహాలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశానికి వచ్చిన అధికారులు, పారిశ్రామిక ప్రముఖులను తాత్కాలిక బోర్డు సభ్యులుగా భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆర్థికపరమైన అంశాలపై భట్టి విక్రమార్కతో, కరికులమ్, కోర్సులకు సంబంధించి మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించాలని సూచించారు.

ఐదు రోజులకో సమావేశం..
స్కిల్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు 15 రోజులే గడువు ఉన్నందున తాత్కాలిక బోర్డు ప్రతీ ఐదు రోజులకు ఓసారి సమావేశం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలా లేక ప్రభుత్వమే బాధ్యతలు చేపట్టాలా అనే అంశంపై కూడా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. యూనివర్సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేసేందుకు నిపుణులను సంప్రదించాలని తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version