Canada: ఉన్నత చదువు కోసం భారతీయులు అమెరికా తర్వాత కెనడాను ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. ఏటా వేల మంది భారతీయ విద్యార్థులు కెనడా వెళ్తున్నారు. ఏడాది క్రితం వరకు అంతా సజావుగా సాగింది. కలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య తర్వాత భారత్–కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అధ్యక్షుడు జస్టిన్ ట్రుడో అమెరికాను దోషిగా చూపే ప్రయత్నం చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అప్పటి నుంచి చదువుల, ఉద్యోగాల కోసం కెనడా వెళ్తున్న భారతీయులకు ఇబ్బందులు పెరిగాయి. తాజాగా కెనడాలో ఇళ్ల సంక్షోభం తలెత్తింది. ఇటీవలే కెనడా ప్రభుత్వం వీసా నిబంధనలు కఠినతరం చేసింది. తాజాగా కెనడాలో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. దీంతో సిటీల్లో ఉండలేని పరిస్థితులు తలెత్తాయి. ఇక సొంత ఇంటి కోసం చూసే వారికి ధరలు షాక్ ఇస్తున్నాయి. దీంతో చాలా మంది పక్క దేశాలకు వలస వెళ్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
శివారు ప్రాంతాలకు వలస..
వృత్తి నిపుణులకు గమ్యస్థానంగా ఉన్న కెనడాలో ఇళ్ల సంక్షోభం తలెత్తింది. ఇళ్ల అద్దెలు, లీజు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చాలా కాలం క్రితమే అక్కడికి వెళ్లిన వారు సొంతిల్లు కొందామన్నా.. ధరలు చూసి కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిణామాలతో విద్యార్థులు, వలసదారులు నగర శివారు ప్రాంతాలకు తరలిపోతున్నారు. కొందరైతే అద్దెల భారం భరించలేక దేశాన్నే వదిలి వెళ్లిపోతుండడం గమనార్హం. అద్దెల భారం భరించలేక కెనడాను వీడుతున్నవారి సంఖ్య 28 శాతంగా ఉన్నట్లు ఆంగస్ రీడ్ ఇనిస్టిట్యూట్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ పరిణామాలతో కెనడా ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఎన్నో ఆశలతో కెనడాకు..
వివిధ దేశాల విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నో ఆశలతో కెనడాకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో సౌకర్యవంతమైన పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఇతర దేశాల వైపు మళ్లుతున్నారు. ఇందులో భారతీయులు కూడా ఉండడం గమనార్హం.
భారీగా పెరిగిన ఇండియన్స్..
అమెరికా తర్వాత భారతీయులను ఎక్కువగా ఆకర్షించేది కెనడా. ఏటా లక్షలాది మంది ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం కెనడాకు వెళ్తున్నారు. అక్కడ ఇళ్ల అద్దెలు భారతీయులకు భారంగా మారుతున్నాయి. పెద్ద ఉద్యోగాలు దొరక్కపోయినా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసైనా సంపాదించుకుందాని అక్కడికి వెళ్తున్న భారతీయులు అద్దెలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఇక కెనడాలో 2013 నాటికి 32,828 మంది ఉన్న భారతీయులు ఉండగా, 2023 నాటికి ఆ సంఖ్య 1,39,715కి చేరింది. దశాబ్దకాలంలో ఏకంగా 326 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఇళ్ల సంక్షోభం భారతీయులపైనా ప్రభావం చూపుతోంది.
ఇళ్ల సంక్షోభానికి కారణం ఇదే..
2021 ఎన్నికల సమయంలో కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో స్థానికులు కూడా ఇళ్లు కొనలేని పరిస్థితి నెలకొంది. వ్యాపారులు, సంపన్న కార్పొరేట్లు, విదేశీ పెట్టుబడిదారులకు కెనడాలో ఇల్లు లాభసాటిగా మారాయని అప్పట్లో లిబరల్ పార్టీ పేర్కొంది. దీంతో సంపన్నులు, విదేశీ పెట్టుబడిదారులు భారీగా ఇళ్ల కొనుగోళ్లు చేపట్టారని తెలిపింది. దీంతో ధరలు భారీగా పెరిగాయని వెల్లడించింది. ఆ ఎన్నికల్లో విజయం తర్వాత కెనడా వాసులు కాని వారు ఇళ్లు కొనడంపై నిషేధం అమలు చేసింది.
పెరిగిన వలసదారులు..
ఇదిలా ఉంటే.. కెనడాలో ఏటా వసలదారులు పెరిగిపోతున్నారు. ఇది కూడా ఇళ్ల సంక్షోభానికి మరో కారణం. భారత్ నుంచి కనెడాకు వెళ్లిన వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఓ సంఘంగా ఏర్పడ్డారని, ఏటా వీరి సంఖ్య పెరుగుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు.
ఉద్యోగాలు దొరకని పరిస్థితి..
కెనడాలో ఇళ్ల ధరలే కాదు ఉద్యోగ కల్పనలోనూ ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నాయి. ఆ దేశంలో నిరుద్యోగం కూడా పెరుగుతోంది. తాజా సూచీ ప్రకారం కెనడాలో నిరుద్యోగ రేటు 29 నెలల గరిష్టానికి చేరింది. మే నెలలో ఇది 6.3 శాతంగా నమోదు కాగా.. జూన్‌లో 6.4గా నమోదైంది. యువతలో నిరుద్యోగ రేటు 0.9 నుంచి 13.5 శాతానికి చేరింది. ఇటీవల చేపట్టిన ఉద్యోగుల వేతనాల పెంపు.. నియామకాలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఇక కెనడాలో ఈ ఏడాది మే నుంచి గంటల ప్రాతిపదికన చెల్లించే ఉద్యోగుల వేతనాన్ని 5.2 నుంచి 5.6 శాతానికి పెంచారు. ఇది నియామకాలపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.