HomeతెలంగాణKTR: వస్త్రపరిశ్రమకు ఏమైంది.. కేటీఆర్‌ ట్వీట్‌ అందుకేనా?

KTR: వస్త్రపరిశ్రమకు ఏమైంది.. కేటీఆర్‌ ట్వీట్‌ అందుకేనా?

KTR: బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోగానే.. ఆ పార్టీ ఆధ్వర్యంలో నడిచే నమస్తే తెలంగాణ పత్రిక ఉద్యోగులకు జీతాల కొరత వచ్చింది… ఒకటో తారీఖున ఇవ్వాల్సిన వేతనాలు 10వ తేదీన చెల్లించారు. అధికారం పోతే అంతా అయిపోయింది అన్నట్లుగా వ్యవహరించింది నమస్తే తెలంగాణ యాజమాన్యం. ఇక ఇప్పుడు కేటీఆర్‌ తెలంగాణ వస్త్ర పరిశ్రమ విషయంలోనే స్పందించిన తీరు అలాగే అనిపిస్తుంది. వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. గత ప్రభుత్వం కొనసాగించిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ.. నేత కార్మికులను ఆదుకునేందుకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. వారం రోజులుగా వస్త్ర పరిశ్రమపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.

వస్త్ర పరిశ్రమకు ఏమైంది..
కేటీఆర్‌ ట్వీట్‌ నేపథ్యంలో తెలంగాణలో వస్త్ర పరిశ్రమకు ఏమైందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో మొట్టమొదటి టెక్స్‌టైల్‌ పార్కును కేటీఆర్‌ తన నియోజకవర్గం సిరిసిల్లలో ఏర్పాటు చేసుకున్నారు. అయితే పార్కులో ఉత్పత్తి అయిన బట్టకు ధర లేక నిల్వలు పేరుకుపోయాయి. మరోవైపు విద్యుత్‌ చార్జీలు భారంగా మారాయి. ముడి సరుకుల ధరలు పెరిగాయి. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉంది. అయితే జనవరి 4న వ్యాపారులు పరిశ్రమలను మూసివేశారు.

115 పరిశ్రమలు..
తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో 2002లో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేశారు. అప్పట్లో నేతన్నలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటుండడంతో పరిస్థితి మెరుగు పరిచేందుకు నాటి కేంద్ర మంత్రి, కరీంనగర్‌ ఎంపీ విద్యాసాగర్‌రావు చొరవతో 60 ఎకరాల విస్తీర్ణంలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేశారు. రూ.7.76 కోట్ల అంచనాతో నిర్మించారు. ఇది రాష్ట్రంలోనే తొలి టెక్స్‌టైల్‌ పార్కు. ఇందులో 2017 పరిశ్రమలు ఏర్పాటు చేసేలా నిర్మాణం చేపట్టారు. ప్రారంభించిన ఏడాదిలోనే 115 పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. పదేళ్లు బాగానే నడిచాయి.

విద్యుత్‌ చార్జీల భారంతో కుదేలు..
అయితే గతేడాది వరకు 40 పరిశ్రమలు మూసివేయగా, బీఆర్‌ఎస్‌ హయాంలో మరో 60 మూతపడ్డాయి. 40 యూనిట్లు కొనసాగుతున్నాయి. వీటిని కూడా జనవరి 4న వ్యాపారులు మూసివేశారు. దీనికి కారణం విద్యుత్‌ భారమే. వస్త్రోత్పత్తిదారులకు యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.3.75 పైసలు ఉన్నప్పుడు టెక్స్‌టైల్‌ పరిశ్రమలు లాభాల్లో పయనించాయి. ఆరేళ్ల క్రితం సబ్సిడీ ఎత్తివేశారు. రూ.8 చొప్పున యూనిట్‌కు వసూలు చేస్తున్నారు. దీంతో పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోయాయి. మరోవైపు బట్టకు ధర లేకపోవడం వ్యాపారులకు మరింత భారంగా మారింది. ప్రభుత్వం విద్యుత్‌ రాయితీ ఇవ్వడం లేదు. దీంతో పరిశ్రమలు మూతపడ్డాయి.

నాడు హామీ ఇచ్చిన కేటీఆర్‌..
నాలుగేళ్ల క్రితం అప్పటి మంత్రి కేటీఆర్‌ను వ్యాపారుల కలిసి విద్యుత్‌ రాయితీ ఇవ్వాలని కోరారు. తప్పకుండా ఇస్తానని హామీ ఇచ్చిన కేటీఆర్‌ మాట నిలబెట్టుకోలేదు. కరెంటు బిల్లుల రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులోనూ అప్పటి ప్రభుత్వం అలసత్వం చేసింది. 2018 చేయాల్సిన రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను 2021లో చేశారు. 2022 నుంచి ఇప్పటి వరకు బకాయిలు ఇవ్వలేదు. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగాయి. దీనికితోడు నూలు రేట్లు పెరగడం, ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరగడంతో వస్త్రపరిశ్రమ సంక్షోభంవైపు పయనిస్తోంది.

లోక్‌సభ ఎన్నికల కోసమేనా..
నాడు మాట ఇచ్చి నిలబెట్టుకోని కేటీఆర్‌.. ఇప్పుడు ఆదుకోవాలని ట్వీట్‌ చేయడం వెనుక ఆంతర్యం వేరే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. కరీంనగర్‌ అభ్యర్థిగా తమ బంధువు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా బండి సంజయ్‌ గెలిచే అవకాశమే ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఫలితాలు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రావడం, లోక్‌సభ ఎన్నికల్లో అయినా మెజారిటీ స్థానాలు గెలిచి పరువు దక్కించుకోవాలని ఆ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌కు వస్త్ర పరిశ్రమ గుర్తుకు వచ్చిందన్న చర్చ జరుగుతోంది.

అయితే.. ఏది ఏమైనా నేత కార్మికుల పరిస్థితి మళ్లీ 2002 ముందు నాటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని పలువురు కోరుతున్నారు. పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతే.. నేత కార్మికుల బతుకులు రోడ్డున పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular