https://oktelugu.com/

Revanth : రేవంత్ సార్.. ఈ మగాళ్ళ చీరల లొల్లి పట్టించుకోండి సార్

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల హామీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఆరు గ్యారంటీలకు ఫిదా అయిన తెలంగాణ ప్రజానీకం పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 27, 2024 / 01:08 PM IST

    Revanth

    Follow us on

    Revanth : గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల హామీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఆరు గ్యారంటీలకు ఫిదా అయిన తెలంగాణ ప్రజానీకం పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. ఇందులో భాగంగా మొదటిసారి మహిళలకు ఫ్రీ జర్నీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించారు. కేవలం ఆధార్ కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చు. దాంతో ఆ పథకానికి మహిళల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది.

    ఫ్రీ బస్సు జర్నీకి మహిళల నుంచి పాజిటివ్ స్పందన కనిపిస్తున్నప్పటికీ పురుషుల నుంచి అదే స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏ బస్సు చూసినా మహిళలతో నిండికనిపిస్తోంది. దీంతో పురుషులు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో జర్నీ చేయలేని పరిస్థితి ఉంది. టికెట్ తీసుకుంటున్నప్పటికీ నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఎక్కడికైనా వెళ్లాలంటే గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. దాని వల్ల సమయం వృథా అవుతోందని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. అంతేకాకుండా తమకు కూడా రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక పండుగల సీజన్ వచ్చిందంటే ఆ ఇబ్బందులు మరిన్ని ఎక్కువే కనిపిస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. లేదంటే ఉరుకులు పరుగులు పెట్టి సీట్లు ఆపుకోవాల్సి వస్తోంది.

    ఇక.. ఏ బస్సులో అయినా వికలాంగులకు, వృద్ధుల కోసం ఇప్పటికే సీట్లు రిజర్వు చేసి పెట్టారు. ప్రతీ బస్సుల్లోనూ అది రాసి కూడా ఉంటుంది. కానీ.. ఈ ఫ్రీ జర్నీ కారణంగా ఆ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. వికలాంగులు, వృద్ధులు వచ్చినప్పటికీ సీట్ల నుంచి లేచి వారికి సీట్లు ఇవ్వడం లేదు. సీటు కోసం అడిగితే గొడవకు దిగుతున్న పరిస్థితులు ఉన్నాయి. బస్సుల్లో దివ్యాంగులకు సీట్లు ఇవ్వడం లేదని వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఆర్టీసీ బస్టాండులో వినూత్న నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్టాండులో వారంతా చీరలు కట్టుకొని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఆర్టీసి ఉచిత ప్రయాణం దివ్యాంగులకు శాపంగా మారిందన్నారు. ఉచిత ప్రయాణంతో దివ్యాంగులకు బస్సుల్లో సీట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవడంతోపాటు దివ్యాంగులను సీట్లను కూడా వదలడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి బస్సుల్లో దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిత్యం ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. మరి వీరి అభ్యర్థన మేరకు సీఎం రేవంత్ కానీ, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కానీ స్పందిస్తారో చూడాలి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సజ్జనార్ స్పందించి సమస్యకు పరిష్కారం చూపుతారని అందరూ అనుకుంటున్నారు.