Sharada Hostel Inspections: ప్రైవేట్ హాస్టళ్లలో పరిస్థితి, వాటిలో విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. అయితే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన హాస్టళ్లలో విద్యార్థులు అత్యంత దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ప్రత్యక్షంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ వుమన్ అండ్ చైల్డ్ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తనిఖీలు చేయడం వల్ల బట్టబయలయ్యాయి.
తమ పిల్లలకు మెరుగైన విద్య అందించాలనే తపనతో లక్షల రుపాయాలు వెచ్చిస్తూ, సుదూర ప్రాంతాలకు చెందిన వారు సైతం కార్పొరేట్ విద్యా సంస్థలలో చేర్పిస్తున్నారు. కాని అందుకు తగిన విధంగా విద్యార్థులకు వసతులు కల్పించే విషయంలో యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరు కల్లారా చూస్తే తప్ప తెలియదు. ప్రధానంగా ఈ విద్యా సంస్థల వైపు అధికారులు కన్నెత్తి చూడరు. లోపల ఏం జరుగుతుందో బయటికి తెలియకుండా జాగ్రత్త పడతారు. అవసరమైతే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకునే విషయంలో వెనుకాడరనే విమర్శలున్నాయి. కనీసం తల్లిదండ్రులను కూడా లోపలికి అనుమతించకపోవడం. వారు ఏ పరిస్థితులో హాస్టళ్లో ఉంటున్నారు. ఎలా, ఏం తింటున్నారు.. అనే విషయాలపై బయటికి ఎవరు చెప్పినా, వారిని మానసిక వేధించడం, పనిష్మెంట్ కింద సస్పెండ్ చేయడం లాంటి దుర్మార్గపు పోకడలను అనుసరిసరిస్తున్నట్లు కమిషన్ చైర్ పర్సన్ పరిశీలనలో బయటపడ్డాయి. కాని వారిపై చర్యలు తీసుకునే ధైర్యం గత ప్రభుత్వాలు చేయలేదు. ఈ ప్రభుత్వమైనా ఆ దిశలో అడుగులు వేయాలని కోరుకుంటున్నారు.
Also Read: Kavitha Praises Revanth: రేవంత్ రెడ్డికి జై కొట్టిన కల్వకుంట్ల కవిత
అయితే ప్రైవేట్ హాస్టళ్లలో మాత్రమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ హాస్టళ్లను తనిఖీ చేయడం లేదని, అక్కడి పరిస్థితి, అక్కడ ఉన్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలనే ప్రశ్న ఉదయించడం సర్వసాధారణమే. కాని అందుకు ఆమె ధీటైన సమాధానం చెప్పారు. కేవలం ప్రైవేట్ సంస్థలు కాకుండా ప్రభుత్వ హాస్టళ్లు విజిట్ చేసిన సందర్భాలను గుర్తు చేస్తూ ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. అయితే వాటి పరిస్థితి లక్షలు పెట్టి చదివిస్తున్న హాస్టళ్లతో పోల్చడం సమంజసం కాదు. ప్రభుత్వ హాస్టళ్లలో పరిస్థితి అనుకున్న స్థాయిలో మెరుగ్గా లేకపోయినా, ప్రైవేట్ హాస్టళ్లలలో పరిస్థితి మరీ దయనీయంగా కనిపిస్తోంది.
చైర్ పర్సన్ శారద నేపథ్యం..
కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద విషయానికి వస్తే, ఒక ఉన్నతాశయంతో జెడ్పీటీసీగా ఎన్నికై రాజకీయాల్లోకి వచ్చిన ఆమె కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా సేవలందిస్తు వస్తున్నారు. రాజకీయ ఉద్దండులు మాజీ మంత్రి ఎమ్మెస్సార్ శిష్యురాలిగా, దివంగత రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో మాట తప్పని, మడమ తిప్పని సిద్దాంతాన్ని పునికిపుచ్చుకున్ననేరెళ్ల శారద వేసే ప్రతి అడుగుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు బలమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు ఆమె ఒక ఇంటర్వ్వూలో తెలిపారు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించడంతో పాటు సమస్యలను ఆకలింపు చేసుకొని వాటి పరిష్కారానికి ఎంతదూరమైన వెళ్లేందుకు వెనుకాడని మనస్తత్వం వుమన్ కమిషన్ చైర్ పర్సన్ పదవిలో రాణించేందుకు దోహదపడింది.
ఏ సమస్యనైనా చెప్పుకోలేక, లోలోపల కుమిలిపోతూ బాధ అనుభవిస్తున్న విద్యార్థినుల సమస్యలను పట్టించుకోవడం, తామున్నామన్న భరోసా కల్పించే విషయంలో ఒక బలమైన అడుగు పడిందని భావించవచ్చు. అయితే ఒకేసారి పూర్తిగా ప్రక్షాళన సాధ్యం కాకున్నా, అంచెలంచెలుగా మార్పుకు ఈ అడుగు శ్రీకారం కావాలని, ఇలాంటి ప్రయత్నానికి అందరి మద్దతు ఉంటేనే పరిస్థితులు మారుతాయని పరిశీలకులు విశ్వసిస్తున్నారు.