https://oktelugu.com/

ప్రయాణికులు లేక బోసిపోతున్న శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టు

కరోనా వైరస్ భయంతో విమానప్రయాణం కుదించుకు పోవడంతో విమానాల రాకపోకలు కూడా గణనీయంగా పడిపోయాయి. దానితో దేశంలోనే ఎక్కువగా రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టులో ఇప్పుడు బంద్ వాతావరణం నెలకొంటున్నది. ఇంతకుముందు ఎయిర్‌‌‌‌పోర్టుకు ప్రతిరోజు 60వేలకు పైగా వచ్చే ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు వరకు నాలుగైదు వేలకు పడిపోయింది. రాత్రిపూట ఎవరైనా వచ్చినా మరో వెయ్యి మందికి మించరు. పైగా, ఈ నెల 22 నుంచి 29 వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు అనుమతి లేదని […]

Written By: , Updated On : March 21, 2020 / 11:11 AM IST
Follow us on

కరోనా వైరస్ భయంతో విమానప్రయాణం కుదించుకు పోవడంతో విమానాల రాకపోకలు కూడా గణనీయంగా పడిపోయాయి. దానితో దేశంలోనే ఎక్కువగా రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టులో ఇప్పుడు బంద్ వాతావరణం నెలకొంటున్నది. ఇంతకుముందు ఎయిర్‌‌‌‌పోర్టుకు ప్రతిరోజు 60వేలకు పైగా వచ్చే ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు వరకు నాలుగైదు వేలకు పడిపోయింది. రాత్రిపూట ఎవరైనా వచ్చినా మరో వెయ్యి మందికి మించరు.

పైగా, ఈ నెల 22 నుంచి 29 వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు అనుమతి లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇంటర్నేషనల్‌‌ ఫ్లైట్లు రద్దవుతున్నాయి. కొన్ని దేశాల నుంచి కనెక్టింగ్‌‌ ఫ్లైట్లు వారం క్రితమే ఆగిపోయాయి. డొమెస్టిక్‌‌ విమానాలు కూడా బాగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడూ వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టు బోసిపోయి కనిపిస్తోంది. క్యాబ్‌‌లకు గిరాకీ లేకపోవడంతో ఎయిర్‌‌పోర్టుకు రావడం తగ్గిపోయింది.

ట్రావెల్‌‌ కంపెనీలు ఇప్పటికే వందలాది క్యాబ్‌‌లను ఉపసంహరించుకున్నాయి. డ్రైవర్లకు సెలవులు ఇచ్చేశాయి. ప్రస్తుతం ఎయిర్‌‌పోర్టుకు పోయిన వారికి బయట బారులు తీరి ఉన్న అంబులెన్సులు దర్శనమిస్తున్నాయి. బయట దేశాల నుంచి వచ్చే కరోనా అనుమానితులను టెస్టులకు తీసుకెళ్లేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఆరు వజ్రా బస్సులను కూడా అందుబాటులో ఉంచారు.

ఇంటర్నేషనల్‌‌ ప్యాసింజర్లకు థర్మల్‌‌ స్ర్కీనింగ్ నిర్వహించేందుకు రెండు వందల మందిని సిద్ధంగా ఉంచారు. ఇక విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు 14 రోజుల పాటు స్వీయనిర్బంధంలోనే ఉండాలని సూచిస్తూ హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేస్తున్నారు.

బ్రిటన్‌‌, టర్కీ, యూరప్ దేశాల నుంచి వచ్చే ఫ్లైట్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. కరోనా ప్రభావం ఎక్కువున్న ఏడు దేశాల (చైనా, సౌత్‌‌కొరియా, ఇరాన్‌‌, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌‌, స్పెయిన్‌‌) నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్‌‌ విధించింది. ప్యాసింజర్లు ఈ దేశాల నుంచి దుబాయ్, ఖతార్‌‌, ఒమన్‌‌, కువైట్‌‌ల నుంచి వచ్చే కనెక్టింగ్‌‌ ఫ్లైట్లలో శంషాబాద్‌‌కు వస్తారు. ప్రయాణికులు తగ్గిపోవడానికి ఇది కూడా కారణమవుతోంది.

దీనికితోడు పలు ఏవియేషన్‌‌ కంపెనీలు తమ విమానాలను రద్దు చేసుకున్నాయి. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం, ఆఫీసుల క్లోజ్‌‌ డౌన్‌‌, వర్క్‌‌ఫ్రమ్‌‌ హోమ్ తోనూ ప్రయాణికుల సంఖ్య బాగా పడిపోతున్నది. ఎమర్జెన్సీ ఉన్నవాళ్లు తప్ప టికెట్‌‌ బుకింగ్‌‌కు రావడం లేదని, తాము కూడా నష్టాలను తట్టుకునేందుకు చార్జీలు పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు. వచ్చే వారం శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టుకు వచ్చే ఫ్లైట్ల సంఖ్య పదుల సంఖ్యకే పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.